ప్రజారాజధాని కాదు..పాలకుల భోజధాని

28 Jun, 2016 22:33 IST|Sakshi
-ఎమ్మెల్యే ఆర్కే
తాడేపల్లి రూరల్: టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తోంది ప్రజారాజధాని కాదు.. అది పాలకుల భోజధానిగా మారిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి స్విస్ చాలెంజ్ ఒప్పందంపై సంతకాలు చేస్తున్న అధికారులతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిలో పాలుపంచుకుంటున్న ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఎప్పుడైనా జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు. 
 
కేంద్ర ప్రభుత్వ నిధులతో రాజధాని నిర్మాణంలో భవనాలన్నింటిని తానే నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీని నిలదీసి నిధులు ఎందుకు సాధించడం లేదని ప్రశ్నించారు. తాత్కాలిక రాజధాని నిర్మాణమే ఇన్ని సంవత్సరాలు పడితే శ్వాశత రాజధాని నిర్మాణం ఎన్నేళ్లు పడుతుందని ప్రశ్నించారు. కోర్ క్యాపిటల్ గ్రామాలైన లింగాయపాలెం, తాళ్లాయపాలెం, మందడం, ఉద్దండ్రాయునిపాలెం గ్రామాలను తొలగిస్తే ఆయా గ్రామాలలోని నిర్వాసితులకు ఎక్కడ నివాసాలు నిర్మించి ఇస్తారని, వారు అందజేసిన భూములకు స్థలాలు ఎక్కడ కేటాయిస్తారో తొలుత చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ క్యాంటీన్లను రాజధాని 29 గ్రామాలలో ఏర్పాటు చేయాలని సూచించారు. వెంటనే రాజధాని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలును నెరవేర్చాలని, లేదంటే ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని ఆయనే హెచ్చరించారు.
>
మరిన్ని వార్తలు