ప్రజావాణికి..పరిష్కారమేదీ?

28 Sep, 2016 21:58 IST|Sakshi
ప్రజావాణి నిర్వహిస్తున్న కలెక్టర్‌ (ఫైల్‌ఫొటో)
చిత్తూరు (కలెక్టరేట్‌):
జిల్లాలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన మీకోసం ప్రజావాణి అలంకారప్రాయంగా మారింది. రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మీకోసం ప్రజావాణికి ఇప్పటివరకు మొత్తం 6,10,334 అర్జీలు రాగా వాటిలో 5,99,234 సమస్యలు పరిష్కరించినట్లు అధికారులు లెక్కల్లో ఆర్భాటంగా చూపెడుతున్నారు. వాస్తవంగా తీసుకున్న అర్జీలకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. అధికారులు చూపెడుతున్న లెక్కలు చూస్తే మాత్రం సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కరించినట్లు ఉంది. వచ్చిన అర్జీలను అధికారులు పరిష్కరించకపోగా అధిక సంఖ్యలోని వినతులను తిరస్కరించడం చేశారు. ఫలితంగా  క్షేత్రస్థాయిలో సామాన్యుడి సమస్య పరిష్కారం కావడం లేదు. 
అధికారులు చూపెడుతున్న గారడీ లెక్కలివే..
మీకోసం ప్రజావాణికి వచ్చే అర్జీల్లో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించిన సమస్యలే ఉండగా ద్వితీయ స్థానంలో గృహనిర్మాణ శాఖకు సంబంధించిన సమస్యలే ఉన్నాయి. రెవెన్యూలో సమస్యలు పరిష్కారం కాకపోయినా పరిష్కరించినట్లు ఆన్‌లైన్‌ చూపెట్టడం చేశారు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వ హయంలో ఇప్పటివరకు ఒక పక్కా గృహాన్ని కూడా మంజూరు చేసిన దాఖలాలు లేకపోయినా వచ్చిన సమస్యలను 99 శాతం పరిష్కరించినట్లు చూపెట్టడమే ఈ గారడి లెక్కలు నిదర్శనం. సమస్యల్లో  పౌరసరఫరాలు, మున్సిపాలిటీలు, పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్‌), పంచాయతీరాజ్‌ తదితర శాఖల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. 23 శాఖలకు చెందిన  57 సమస్యల్లో ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోకపోవడం గమనార్హం. 
జూలై 2014 నుంచి ఇప్పటివరకు వచ్చిన అర్జీలు, వాటి పరిష్కార వివరాలు మచ్చుకు ప్రధాన శాఖల లెక్కలు ఇలా ఉన్నాయి. 
శాఖ పేరు మొత్తం అర్జీల సంఖ్య పరిష్కరించినవి పెండింగ్‌లో ఉన్నవి
రెవెన్యూ 1,70,983 1,68,934 2,049
హౌసింగ్‌ 1,54,462 1,53,260 1,202
మున్సిపాలిటీ 16,911 14,738 2,173
సెర్ఫ్‌ 62,027 60,880 1,147
పంచాయతీరాజ్‌ 27,977 27,052 925
సివిల్‌ సప్లయిస్‌ 1,40,693 1,40,055 638
కమిషనర్‌ ఆర్‌డీ 19,630 19,069 561
రూరల్‌ వాటర్‌ సప్లయ్‌ 8,122 7,881 241
విద్యుత్‌ 1,636 1,558 78
దేవాదాయశాఖ 342 150 192
ఆర్‌అండ్‌బీ 942 723 219
విద్య 490 332 158
పోలీసు 366 212 154
భూగర్భ జల శాఖ 245 91 154
ఇరిగేషన్‌ 91 28 63
బీసీ కార్పొరేషన్‌ 74 11 63
గ్రామీణాభివృద్ధి 153 92 61
అటవీశాఖ 67 13 54
వ్యవసాయం 575 537 38
 
రెండేళ్లుగా తిరుగుతున్నా.. 
నేను కాళ్లు లేక నడవలేని స్థితిలో ఉన్నాను. ఏళ్ల తరబడి అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా నా సమస్యను పరిష్కరించడం లేదు. ఎక్స్‌ ఆర్మీ అయిన నా తండ్రికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు స్వార్థపరులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. నాకు ఆ భూములే జీవనాధారం. ఆ భూమిని ఇప్పించి న్యాయం చేయాలని కలెక్టరేట్‌ చుట్టూ రెండేళ్లుగా తిరుగుతున్నా నా గోడును పట్టించుకోనే నాథుడే లేరు. నాపై దయ చూపి భూమిని ఇప్పించి ఆదుకోవాలి.
– సుందర్‌రాజ్, 189 కొత్తపల్లె దళితవాడ, గుడిపాల మండలం
 
స్పందించడం లేదు 
మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఇప్పటికీ ఆరునెలల వ్యవధిలో మూడు దఫాలుగా కలెక్టరేట్‌కు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు. గత 40 ఏళ్లుగా తమ గ్రామానికి ఉన్న దారిని స్వార్థపరులు ఆక్రమించుకుని, ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. – శ్రీ కల్యాణవెంకటేశ్వరా గ్రామస్తులు, పుత్తూరు మండలం
 
 
 
మరిన్ని వార్తలు