ప్రకాశం పంతులు సాక్షిగా అవమానం

24 Aug, 2016 04:35 IST|Sakshi
ప్రకాశం పంతులు సాక్షిగా అవమానం
  • టంగుటూరి జయంత్యుత్సవాల్లో సమయపాలనకు తిలోదకాలు
  • గంటన్నరసేపు ఎదురు చూసిన స్వాతంత్య్ర సమరయోధులు 
  • ఇన్‌చార్జి మంత్రి ఎంతకు  రాకపోవడంతో తీవ్ర అసహనం
  • నాలుగుసార్లు వెళ్లేందుకు సిద్ధమైన కరవది వెంకటేశ్వర్లు
  • ఐదోసారి స్వయంగా నచ్చజెప్పి కూర్చోబెట్టిన జేసీ
  • అప్పటికే వెనుదిరిగి వెళ్లిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌
  • ఒంగోలు టౌన్‌ : టంగుటూరి ప్రకాశం పంతులు జయంత్యుత్సవాలను పండుగలా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జయంత్యుత్సవాలకు ప్రజాప్రతినిధులతో పాటు స్వాతంత్య్ర సమరయోధులను కూడా జిల్లా యంత్రాంగం ఆహ్వానించింది. మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రకాశం భవనంలోని ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామని ప్రకటించిం ది. స్వాతంత్య్ర సమరయోధులు కరవది వెంకటేశ్వర్లు, గంగవరపు వందనం, అశ్వద్ధనారాయణ సకాలంలో ప్రకాశం భవనం వద్దకు చేరుకున్నారు. వారితో పాటు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కూడా అక్కడకు చేరుకున్నారు.
     
    అప్పటికే జిల్లా అధికారులంతా అక్కడే ఉన్నారు. వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ హాజరవుతుండటంతో వారి కోసం జిల్లా యంత్రాం గం ఎదురు చూసింది. ఒకవైపు ఎండ తీవ్రత, ఇంకోవైపు వారి రాక ఆలస్యం కావడంతో స్వాతంత్య్ర సమరయోధులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. స్వాతంత్య్ర సమరయోధుడు కరవది వెంకటేశ్వర్లు నాలుగుసార్లు అతికష్టంగా తన కుర్చీలోంచి లేచి వెళ్లేందుకు ప్రయత్నిస్తే అధికారులు సముదాయించి కూర్చోబెట్టారు.
     
    అయినా ఇన్‌చా ర్జి మంత్రి జాడ లేకపోవడంతో ఇంతసేపు కూర్చోవడం తనవల్ల కాదంటూ పక్కనే ఉన్న తన కుటుంబ సభ్యురాలి సాయంతో కరవది వెంకటేశ్వర్లు లేచి రెండు అడుగులు వేశారు. సమీపంలో ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ హుటాహుటిన ఆయన వద్దకు వచ్చి సముదాయించేందుకు ప్రయత్నించారు. మంత్రిగారు బయల్దేరారు.. రెండు నిమిషాల్లో వస్తారంటూ సర్దిచెప్పి బలవంతంగా కూర్చోబెట్టారు.
     
    అప్పటికే గంటకుపైగా అక్కడ ఉన్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఈదర హరిబాబు ఆలస్యం అవుతుండటంతో అసహనంతో అక్కడి నుంచి లేచి తన కారులో వెళ్లిపోయారు. ఒకవైపు ఎండ తీవ్రత, ఇంకోవైపు సమయం దాటిపోతుండటంతో స్వాతంత్య్ర సమరయోధులను ఉంచేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒకానొక దశలో వారు సొమ్మసిల్లిపోతారేమోనన్న ఆందోళన కూడా అధికారుల్లో నెలకొని ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఒక్కో అధికారి ఆ ముగ్గురు స్వాతంత్య్ర సమరయోధుల వద్దకు వచ్చి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండటం విశేషం.
     
మరిన్ని వార్తలు