బె‘ధర’గొడుతున్న ఆవకాయ!

18 May, 2016 08:47 IST|Sakshi
బె‘ధర’గొడుతున్న ఆవకాయ!

* పచ్చళ్ల తయారీపై ధరల పోటు
* కన్నీళ్లు తెప్పిస్తున్న కారం పొడి
* రెట్టింపైన ఆవాలు, ధనియాలు, మెంతుల రేట్లు
* మామిడికాయలదీ అదే దారి

కామారెడ్డి: ప్రతి ఇంటా కనిపించే ఆవకాయ.. ఈసారి ఖరీదై పోయింది. పచ్చళ్ల తయారీపై ధర భారం పడింది. తొక్కుల తయారీలో ఉపయోగించే అన్ని వస్తువుల రేట్లకు రెక్కలొచ్చాయి. కారం పొడి, జీలకర్ర, మెంతు లు, ఆవాలు, ధనియాలకు తోడు మామిడికాయ ధరలు చుక్కలనంటుతున్నాయి.

నోరూరించే ఆవకా య ప్రస్తుతం ఆర్థికంగా భారమైంది. ఏపూటకు ఆ పూట సర్దుకొనే పేద కుటుంబమైనా, ఆర్థికంగా స్థితిమంతులైనా సరే.. ప్రతి ఇంట్లో కచ్చితంగా పచ్చడి ఉండాల్సిందే. ప్రతి ఒక్కరూ అన్నంతో పాటు ఆవకాయను ఆరగించాల్సిందే. కొందరు పేదలైతే పచ్చడితోనే పూట గడిపేస్తారు. ఓపూట కూర లేకున్నా ఆవకాయతో సర్దుకుంటారు. ముఖ్యంగా రైతులు, రైతు కూలీ లు ఏడాదికి సరిపడినంతగా పచ్చళ్లను తయారు చేసుకుంటారు. అయితే, ఈసారి పచ్చళ్ల తయారీకి వాడే వస్తువుల ధరలు అనూహ్యంగా పెరగడంతో తొక్కుల తయారీకి సిద్ధమైన పేద, మధ్య తరగతి వర్గాలు నిట్టూరుస్తున్నాయి.
 
ఎన్నెన్ని రకాలో..
మామిడికాయతో రకరకాలు తొక్కులు, పచ్చళ్లు తయారు చేస్తారు. మామిడి కాయను తరిగి చేసే తొక్కును సొప్పు తొక్కు అంటారు. అలాగే, ఆవకాయ తొక్కు, ఎల్లిపాయ తొక్కు, ఉప్పావ, మెంతావ తదితర రకాల పచ్చళ్లు చేస్తారు. చక్కెర, కొబ్బరితోనూ రకరకాల తొక్కులు పెడతారు. పేదల ఇళ్లలో మాత్రం ఆవకాయ తొక్కే ఎక్కువగా కనిపిస్తుంది.
 
అన్ని ధరలు పెరిగినయి
తొక్కులు పెట్టెతందుకు ముందుగళ్లనే అన్ని సామాన్లు తెచ్చి పొడులు తయారు చేసుకుంటం. ఇంతకు ముందు పెద్ద పెద్ద మడ్తమాన్లల్ల తొక్కులు పెట్టేటోళ్లం. ఇప్పుడు కొద్దిగంతనే పెట్టుకుంటున్నం. కారంపొడి, ఆవాలు, మెంతులు, ధనియాల ధరలు అడ్డగోలుగా పెరిగినయి. వేలకు వేలు పెట్టి తొక్కులు పెట్టడం భారంగా మారింది.  - శేర్ల లక్ష్మి, భిక్కనూరు
 
చుక్కలనంటుతోన్న ధరలు..
తొక్కుల తయారీలో జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి, ఆవాల పొడి, కారంపొడి, ఉప్పు, ఆవాలు, పల్లి నూనె వాడతారు. జీలకర్ర ధర గత యేడాది కిలోకు రూ.180 ఉంటే ఈసారి రూ.240కి చేరింది. మెంతులు నిరుడు రూ.60 ఉంటే ఇప్పుడు రూ.130కి చేరాయి. ధనియాల పొడి గతంలో రూ.120 ఉండగా, ఇప్పుడు రూ.170, కారంపొడి నిరుడు రూ.170 ఉంటే, ప్రస్తుతం రూ.240 కి చేరాయి. కుటుంబానికి సరిపడా తొక్కుల తయారీకి గతంలో రూ.2 వేల లోపు సరిపోయేది. ప్రస్తుతం పెరిగిన ధరలతో రూ.3-4 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
మామిడికాయల ధరలు సైతం..
వాతావరణ పరిస్థితులు సహకరించక ఈసారి మామిడి సరిగా కాయలేదు. కాసినా వడగళ్లు, ఈదురుగాలులతో రాలిపోయాయి. దీంతో మామిడికాయల కొరత ఏర్పడి, వాటి ధరకు రెక్కలొచ్చాయి. ఆవకాయ కోసం అవసరమైన చిన్న మామిడి కాయ ధర ఒక్కొక్కటి గతంలో రూ.2-3 ఉంటే, ప్రస్తుతం రూ.5-6 పలుకుతోంది. అలాగే సొప్పు తొక్కులు పెట్టే పెద్ద మామిడికాయలు గతంలో రూ5 ఉంటే, ఇప్పుడు రూ.10కి చేరింది.

నిమ్మకాయలదీ అదే పరిస్థితి. మార్కెట్‌లో వాటి ధరలు అడ్డగోలుగా ఉన్నాయి. దీంతో తొక్కు అంటేనే జనం ముక్కు విరుస్తున్నారు. తొక్కులు పెట్టుకునేకన్నా అవసరం ఉన్నపుడు రెడీమెడ్ పచ్చళ్లు తెచ్చుకోవడమే ఉత్తమమని చాలా మంది తొక్కులకు దూరమవుతున్నారు. గతంలో ఏ ఇంట్లో అయినా 2-3 మడతమానుల నిండా పచ్చళ్లు పెట్టేవారు. ఇప్పుడు పెరిగిన ధరలతో తొక్కుల వాసన రావడం లేదు.

మరిన్ని వార్తలు