ప్రణాళికలు రూపొందించండి

13 Sep, 2016 23:53 IST|Sakshi
ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : పోలవరం ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 2018 జూన్‌ నుంచి నీటిని విడుదల చేయడానికి అనువుగా జల వనరుల శాఖ అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్‌ అతిథి గృహంలో పనుల ప్రగతిపై ఇరిగేషన్‌ అధికారులు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీల ప్రతినిధులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే అక్టోబర్‌ 16వ తేదీ నుంచి పోలవరం ప్రాజెక్ట్‌ స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు ప్రారంభించాలన్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకా 639 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని చేయాల్సి ఉందని, ఈ పనిని వేగవంతం చేసేందుకు అధునాతన యంత్రాలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. లక్ష క్యూబిక్‌ మీటర్లకే పరిమితమైన మట్టి పనులను 2.40 లక్షల క్యూబిక్‌ మీటర్లకు పెంచాలని, అవసరమైతే మరిన్ని అధునాతన యంత్రాలు విని యోగించాలని ఆదేశించారు. పోల వరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులపై 4 నెలలకు ఒకసారి ఢిల్లీ స్థాయి అధికారులతో సమీక్షించడంతోపాటు రాష్ట్ర స్థాయిలో ప్రతినెలా క్షేత్ర స్థాయిలో పర్యటించి సమీక్షిస్తానని చెప్పారు.
 సమావేశంలో జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమ, ప్రిన్సిపల్‌ కార్యదర్శి సతీష్‌చంద్ర, జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు కె.భాస్కర్, హెచ్‌.అరుణకుమార్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్‌ భవానీప్రసాద్, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీర్‌ హరిబాబు, సూపరింటెండింగ్‌ ఇంజినీర్లు వి.రమేష్‌బాబు, పోలేశ్వరరావు, ఎంటీ రాజు, శ్రీనివాస్‌యాదవ్, ట్రాన్స్‌ట్రాయ్‌ సీఎండీ చెరుకూరి శ్రీధర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం.సాంబశివరావు, కుకునూరు సబ్‌ కలెక్టర్‌ షాన్‌మోహన్‌ పాల్గొన్నారు.
జిల్లా ప్రతినిధులకు చోటేది
సమీక్ష సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాత, స్థానిక ఎమ్మె ల్యే మొడియం శ్రీనివాస్, అక్కడే ఉన్న ఇతర ఎమ్మెల్యేలను ఆహ్వానించక పోవడం చర్చనీయాంశమైంది. 
కారులో విజయవాడకు..
ఏలూరు అర్బన్‌ : పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్డు మార్గంలో విజయవాడ ప్రయాణమయ్యారు. తొలుత ఆయన హెలికాప్టర్‌లో విజయవాడ చేరుకునే విధంగా అధికారులు షెడ్యూల్‌ రూపొందించారు. అయితే, పోలవరంలో భారీ వర్షం కురవడంతో హెలికాప్టర్‌ ప్రయాణించేందుకు అనువైన పరిస్థితులు లేవని, రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకోవాలని భద్రతా అధికారులు సూచించారు. దీంతో ముఖ్యమంత్రి పోలవరం, నల్లజర్ల, దూబచర్ల, గుండుగొలను, ఏలూరు, గన్నవరం మీదుగా రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు. ముఖ్యమంత్రి రాకతో దూబచర్ల, గుండుగొలను, ఏలూరు, గన్నవరం జాతీయ రహదారి వెంబడి గంటల తరబడి వాహనాలను నిలిపివేశారు. ఆర్టీసీ బస్‌లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
 
మరిన్ని వార్తలు