సార్వత్రిక సమ్మెకు అంతా సిద్ధం

1 Sep, 2016 23:11 IST|Sakshi
అటోకు అంటిస్తున్న సమ్మె పోస్టర్‌
  • ఆర్టీసీ, ఆటో కార్మికులు సమ్మెలోనే..
  • సై అంటున్న సంఘటిత, అసంఘటిత కార్మికులు
  • సక్సెస్‌ కోసం 7 కార్మిక సంఘాల ర్యాలీలు
  • ఖమ్మం : కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ మినహా అన్ని పార్టీలు, అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధం చేశారు. సమ్మెను విజయంవంతం చేసేందుకు నెల రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సభలు, సమావేశాలు విస్తృతంగా నిర్వహించారు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, వైరా, మణుగూరు, ఇల్లెందు, మధిర ప్రాంతాల్లో కార్మిక సంఘాల అధ్వర్యంలో బైక్‌ ర్యాలీలు చేపట్టారు. దీంతో శుక్రవారం తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. 
    సమ్మెలో 3లక్షల మంది..
    సమాన పనికి సమాన వేతనం, కార్మికుల సంక్షేమం, వేతనాల పెంపు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసే పాలసీల రద్దును డిమాండ్‌ చేస్తూ శుక్రవారం 7 కార్మిక సంఘాలు తలపెట్టిన జాతీయ సార్వత్రిక సమ్మెలో జిల్లావ్యాప్తంగా 3లక్షల మందికి పైగా కార్మికులు పాల్గొనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ, టీఆర్‌కేవీ, ఐఎఫ్‌టీయూ–2తోపాటు వాటి అనుబంధ ఆర్టీసీ, ఆటో కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మికులు, హమాలీ, గుమస్తాల సంఘం కార్మికులు పాల్గొననున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బీఎస్‌ఎన్‌ఎల్, బ్యాంకింగ్, రైల్వే, పోస్టల్‌ ఉద్యోగులు కూడా సమ్మెలో భాగస్వాములు అవుతున్నారు. జిల్లాలోని సింగరేణి, గ్రానైట్‌ కార్మికులు, హెవీ వాటర్‌ ప్లాంట్, బీపీఎల్, కేటీపీఎస్, స్పాంజ్‌ ఐరన్‌ కార్మికులు సమ్మెకు మద్దతుగా నిలిచారు. అదేవిధంగా పలు ఉపాధ్యాయ సంఘాలు సమ్మెకు మద్దతు తెలిపి.. విధులకు హాజరవుతామని, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో సంతకాలు చేసి సమ్మెలో పాల్గొంటామని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పినట్లు ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు ప్రకటించారు. ఇలా జిల్లావ్యాప్తంగా 3లక్షల మంది ప్రత్యేక్షంగా, మరో 20వేల మంది పరోక్షంగా సమ్మెలో పాల్గొననున్నారు. 
    స్తంభించనున్న జనజీవనం
    కార్మిక, ఉద్యోగ సంఘాలు సార్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధం కావడంతో.. శుక్రవారం జిల్లావ్యాప్తంగా జనజీవనం స్తంభించనుంది. ప్రధానంగా జిల్లాలోని 6 ఆర్టీసీ బస్‌ డిపోల పరిధిలోని కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు తెలిపారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 3వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సై అనడంతో బస్సులు డిపో నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. ఆటో రిక్షా కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో ఆటోలు కూడా రోడ్డెక్కవు. వీటితోపాటు గుమస్తాల సంఘం, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు ఇలా సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనడంతో గ్రామీణ ప్రజలు పట్టణాలకు వచ్చే అవకాశం తక్కువ. దీంతో వర్తక, వ్యాపార సంస్థలు కూడా స్తంభించిపోయే అవకాశం ఉంది. 
     
    సమ్మెకు సహకరించండి..
    కార్మిక, కర్షక వర్గాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఆయా పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. ప్రజలు సమ్మెకు సహకరించాలి. 
    – కల్యాణం వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకుడు
     
    కార్మికుల సత్తా చాటాలి..
    సమ్మె ద్వారా కార్మికులు సత్తా చాటాలి. సమ్మెలో జిల్లావ్యాప్తంగా 3లక్షల మంది కార్మికులు పాల్గొనడంతో ప్రభుత్వానికి కార్మికుల సత్తా తెలిసిరావాలి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెలిపించాలి. 
    – బీజీ క్లైమెంట్, ఏఐటీయూసీ నాయకుడు
     
>
మరిన్ని వార్తలు