ఉద్యోగాల భర్తీలో స్థానికులకే ప్రాధాన్యం

8 Jan, 2017 00:31 IST|Sakshi
 - సీఎం చేతులమీదుగా ఫిబ్రవరిలో జైన్‌ పరిశ్రమకు శంకుస్థాపన 
 
తంగెడంచ(జూపాడుబంగ్లా): జూపాడుబంగ్లాలో స్థాపించనున్న పరిశ్రమల్లో నందికొట్కూరు నియోజకవర్గ నిరుద్యోగులకే ప్రాధాన్యం ఇస్తామని కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన తంగెడంచ ఫారంభూముల్లో స్థాపించనున్న జైన్‌ ఇరిగేషన్‌ పరిశ్రమ, గుజరాత్‌ అంబుజా రోడ్ల నిర్మాణ పనులను  పరిశీలించారు. పరిశ్రమలకు అనువైన రహదారి నిర్మాణ పనులను నెలాఖరులోగా పూర్తిచేయించాలని ఏపీఐఐసీ జడ్‌ఎం గోపాలకృష్ణకు సూచించారు. కమిటీ చైర్మన్‌గా తానే ఉన్నందునా పరిశ్రమల్లో నందికొట్కూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల నిరుద్యోగుల తర్వాతే ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. తంగెడంచ గ్రామంలో సిమెంటు రహదారులు, డ్రైనేజీలను నిర్మించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామానికి సమీపంలో ఉన్న సుద్దవాగును పూడ్చేందుకు రైతులు చేసిన విజ్ఞప్తిని కలెక్టర్‌ అంగీకరించారు. గుజరాత్‌ అంబుజా పరిశ్రమకు 200 ఎకరాలు, జైన్‌ పరిశ్రమకు 634 ఎకరాలను కేటాయించామన్నారు. వీటిలో 8వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జైన్‌ ఇరిగేషన్‌ కంపెనీ సీఈఓ షమీర్‌శర్మ, తహసీల్దారు జాకీర్‌హుసేన్, ఆర్‌ఐ సుధీంద్ర, వీఆర్వో జగదీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు