ఖమ్మం ఎన్నికలంటేనే ప్రభుత్వానికి వణుకు

1 Mar, 2016 05:15 IST|Sakshi
ఖమ్మం ఎన్నికలంటేనే ప్రభుత్వానికి వణుకు

ప్రజాసమస్యలు పక్కనపెట్టి ఫిరాయింపులకు ప్రోత్సాహం
ఓటమి భయంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలో తిష్ట
కార్పొరేషన్‌లో కాంగ్రెస్ విజయంతో కేసీఆర్ కళ్లు తెరవాలి
విలేకరుల సమావేశంలో గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ


ఖమ్మం: ‘ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు అంటేనే సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ పార్టీకి వణుకు పుడుతోంది. ప్రజలను బలవంతపెట్టి, భయపెట్టి..లొంగదీసుకోవడమే టీఆర్‌ఎస్ నాయకుల పనిగా మారింది..’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

కేసీఆర్, ఆయన మంత్రి వర్గానికి ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఖమ్మం ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. ఓటమి భయంతోనే ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఖమ్మంలో తిష్టవేశారన్నారు. పోటీలో ఉన్న ఇతర పార్టీల నాయకుల ఇళ్లకు వెళ్లి రాత్రిళ్లు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బెదిరిస్తే పార్టీలోకి వచ్చిన వారు ఎంతకాలం ఉంటారని ప్రశ్నించారు. ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దిగజారుడు రాజకీయాలు చేయడం కేసీఆర్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో కూడా అభ్యర్థులను బెదిరించి, నామినేషన్ ఉపసంహరించుకుంటే రూ. 25 లక్షలు ఇస్తామని ఆశపెట్టారని ఆరోపించారు. నిరంకుశ పోకడల నుంచి కేసీఆర్ కు కనువిప్పు కలగాలంటే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఖమ్మం నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొల్లు పద్మ, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు