విద్యుత్‌ సమస్యలు తలెత్తనీయొద్దు

24 Sep, 2016 23:31 IST|Sakshi
– కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలి
– ఇందన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌
 
కర్నూలు(రాజ్‌విహార్‌): రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్‌ సమస్య తలెత్తనీయకుండా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ఇందన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన విజయవాడ నుంచి స్థానిక అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయన్నారు. ఈ కారణంగా విద్యుత్‌ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, కండక్టర్లు, ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించేందుకు సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. సబ్‌స్టేషన్లలోకి నీళ్లు వస్తే వాటిని తోడేసేందుకు అవసరమైన జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వినియోగదారుల సమస్యలు తెలుసుకునేందుకు కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరులో జాప్యం లేకుండా చూడాలని, లైన్‌లాస్‌ను నియంత్రించేందుకు మీటర్‌ సేల్స్‌ పెంచాలని చెప్పారు. సమావేశంలో సీఈ పీరయ్య, ఎస్‌ఈ భార్గవ రాముడు, డీఈటీ మహమ్మద్‌ సాధిక్, ఏడీఈటీ శేషాద్రి పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు