'బాబూరావును ఏ-1 ముద్దాయిగా చేర్చాలి'

30 Jul, 2015 19:21 IST|Sakshi

గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో ప్రభుత్వం నియమించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ విచారణ రెండో రోజు కూడా కొనసాగింది. ఇందులో భాగంగా ఈ కమిటీ గురువారం ఉదయం విద్యార్థులు, అధ్యాపకులు, యూనివర్సిటీకి సంబంధించిన ఇతర సభ్యులతో సమావేశం అయింది.
 
ప్రిన్సిపల్ బాబూరావును వెంటనే అరెస్ట్ చేసి, ఏ-1 ముద్దాయిగా చేర్చాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బాబూరావు ఎదుర్కొంటున్న ఇతర అభియోగాలపై కూడా విచారణ జరపాలని పట్టుబట్టారు. గతంలో ముగ్గురు మహిళా అధ్యాపకులు అకారణంగా యూనివర్శిటీని ఎందుకు వదిలి వెళ్లిపోయారో వెలికితీయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. సెలవులు రద్దు చేసి వెంటనే తరగతులు నిర్వహించాలని, విద్యార్థులతో బహిరంగ విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

మరో వైపు రెండో రోజు విచారణకు రిషితేశ్వరి హాస్టల్ విద్యార్థులు, ఆర్కిటెక్చర్ కాలేజీ విద్యార్థులు హాజరుకాలేదు. మధ్యాహ్నం తర్వాత విచారణ కమిటీని ప్రిన్సిపల్ బాబూరావు అనుకూల విద్యార్థులు కలిశారు. రిషితేశ్వరి తల్లిదండ్రులను రెండుగంటలసేపు కమిటీ విచారించింది. 

మరిన్ని వార్తలు