ఆలయ భూములు.. హారతి కర్పూరం!

3 Aug, 2016 22:36 IST|Sakshi
ఆలయ భూములు.. హారతి కర్పూరం!
చండూరు
పాత జీఓల్లోని లొసుగులను ఆధారంగా చేసుకొని పూజారులు వందల ఎకరాల ఆలయ భూములను విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఆలయ పూజారి తెలివి, దేవాదాయ శాఖ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, రిజిస్ట్రేషన్‌ అధికారుల చేతి వాటం వెరసి  కోట్లాది రూపాయాల విలువ చేసే భూములన్ని నేడు రియల్టర్ల చేతిలో పడుతూ వస్తున్నాయి. పాత జీఓలు, కోర్టు ఉత్తర్వులంటూ పూజారి కుటుంబం చేస్తున్న హడావుడితో ఎండోమెంట్‌ శాఖ ఆలయ భూములను రక్షించుకోలేకపోతుంది. చండూరులోని సీతారామచంద్రస్వామి దేవాలయం నిర్వహణకు కుంభం వంశస్తులు ఆనాడు సుమారుగా వంద ఎకరాల వరకు భూములను దానంగా ఇచ్చారు. ఇందులో 60 ఎకరాలను పూజారికి స్వంతంగా కేటాయించగా, మిగిలిన 40.35 ఎకరాలు మాత్రం దేవాలయం పేరున ఉంది. కొంత కాలంగా మండలంలో పెరిగిన రియల్‌ ధరలను అవకాశంగా తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా ఆలయ భూములను ఆ పూజారులు రియల్టర్లకు అమ్మేసుకున్నారు. గతంలో రాష్ట ప్రభుత్వం పూజారులకు కేటాయించిన ఆలయ భూములను విక్రయించుకోవచ్చనే వెసలుబాటు కల్పించింది. ఇదే అదునుగా తీసుకున్న ఆలయ పూజారి 60 ఎకరాలను ఆనాడే అమ్మేసుకుని సొమ్ముచేసుకున్నాడు.
ఇక ఆలయ భూముల పై కన్ను..
 తనకు కేటాయించిన భూములను అమ్ముకున్న పూజారులు ఇక ఆలయ భూములు ఎలా విక్రయించుకోవాలనే ఆలోచన ఆ పూజారుల కుటుంబంలో వచ్చింది. కాకపోతే అటు ఆలయ భూములు, ఇటు పూజారికిచ్చిన భూములకు చెందిన సర్వే నంబర్లు ఒకటే కావడంతో చిక్కు వచ్చి పడింది. 2005 సంవత్సరానికి ముందే ఆలయ భూములు విక్రయాలు జరుపుకునేందుకు పూజారి కుటుంబం యత్నాలు చేసింది. దీంతో గ్రామస్తుల తిరుగుబాటుతో తాత్కాలికంగా విక్రయాలు వాయిదా వేసుకున్నారు. తిరిగి 2011, మే నెలలో రెండు ఎకరాలను రియల్టర్లకు గుట్టుచప్పుడు కాకుండా విక్రయించారు. ఆ వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయించారు. కొనుగోలు చేసింది ఆయా పార్టీలకు చెందిన నాయకులు కాబట్టే కొంత కాలం గుట్టు బయటకు పొక్కలేదు. తర్వాత ఆనోట ఈ నోట కొనుగోలు విషయం తెలవడంతో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. అధికారులు స్పందించి సర్వే చేయించారు. సుమారుగా ఆరు సంవత్సరాలు ఆ భూమిని విక్రయించిన రియల్టర్లు స్తంబ్ధంగా ఉండి తిరిగి మరో ఓ వ్యక్తికి అమ్మేసుకొని బయాన సైతం తీసుకున్నారని సమాచారం. దీంతో మంగళవారం ఆ విషయం బయటకు తెలిసింది. బుధవారం ఎండోమెంట్‌ ఈఓ సులోచన, తహసీల్దార్‌ కృష్ణారావు దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. 
 
సమాచారం అందింది
సులోచన, ఎండోమెంట్‌ ఈఓ 
దేవాలయానికి చెందిన భూమిని విక్రయించినట్లు ఫోన్‌లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌తో మాట్లాడా. పుష్కరాలు ఉండడంతో అదనపు విధులు నిర్వహిస్తున్నాం. రెండు మూడు రోజులలో సందర్శిస్తాను.
 
కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం
– కోడి గిరి బాబు, మాజీ సర్పంచ్‌
దేవాలయానికి చెందిన భూములను కొనుగోలు చేసిన వారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. గతంలోనే కొనుగోలు చేస్తే ఆందోళన చేశాం. తిరిగి ఎండో మెంట్, రెవెన్యూ అధికారులు స్పందించి కొలతలు వేశారు. కొనుగోలు చేసిన కొంతమంది తిరిగి మరొకరికి భూమిని విక్రయించారు. దేవాలయ భూముల పరిరక్షణ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం. 
 
ఎండోమెంట్‌కు తెలియ జేస్తా
–కృష్ణారావు, తహసీల్దార్‌
దేవాలయానికి చెందిన భూమిని అమ్మినట్లు తన దృష్టికి వచ్చింది. ఎండోమెంట్‌ అధికారులకు తెలియజేస్తా. అమ్మిన భూమి ని పరిశీలించాలని వీఆర్వోకు ఆదేశాలు జారిచేశా. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
 
>
మరిన్ని వార్తలు