టీఎస్ ఐపాస్ ను ప్రధాని మెచ్చారు..

15 Apr, 2016 02:31 IST|Sakshi
టీఎస్ ఐపాస్ ను ప్రధాని మెచ్చారు..

15 రోజుల్లో అనుమతులు, ఆరు నెలల్లో కంపెనీ ప్రారంభం
జిల్లాకు భారీ పరిశ్రమలు రానున్నాయి
ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
రావిర్యాల, శ్రీనగర్ ఫ్యాబ్‌సిటీలో మైక్రోమ్యాక్స్ సెల్‌ఫోన్లు, ఎల్‌ఈడీల తయారీ యూనిట్లు ప్రారంభం

 మహేశ్వరం: టీఎస్ ఐపాస్ విధానాలను ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించారని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. కొత్త కంపెనీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. మహేశ్వరం మండలం రావిర్యాల, శ్రీనగర్ ఫ్యాబ్‌సిటీలో మైక్రోమ్యాక్స్ సెల్‌ఫోన్ల తయారీ యూనిట్‌ను మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కంపెనీల అనుమతికి సంవత్సరాలు పట్టేదని, ప్రస్తుతం 15 రోజుల్లో అనుమతులు, ఆరు నెలల్లో కంపెనీ నిర్మాణం చేస్తున్నారని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో జిల్లాకు మరిన్ని ఐటీ, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్ కంపెనీలు, పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.20,300 కోట్ల పెట్టుబడులతో మొత్తం 1,631 పరిశ్రమలకు టీఎస్ ఐపాస్ నుంచి అనుమతులు లభించాయని చెప్పారు. అందులో 840 పరిశ్రమలు ప్రారంభమై ప్రొడక్షన్ తయారు చేస్తూ 38 వేల మందికి ఉద్యోగాలు కల్పించాయని వివరించారు. మైక్రోమ్యాక్స్ కంపెనీ ప్రపంచంలో టాప్ టెన్‌లో ఉందని, ఈ కంపెనీ ఏర్పాటుతో మరింత మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 13 ఐటీ కారిడార్లు రానున్నాయన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, రావిర్యాల, శ్రీనగర్ ప్యాబ్‌సిటీలో కల్యాణి గ్రూప్స్, సెల్‌కాన్‌తోపాటు మరిన్ని ఎలక్ట్రానిక్ పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు. 

 ఉద్యోగులతో మాటామంతీ...
రావిర్యాల, శ్రీనగర్ ఫ్యాబ్‌సిటీలో మైక్రోమ్యాక్స్ కంపెనీ ప్రారంభం కార్యక్రమం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఉద్యోగులతో మాట్లాడారు. ఏ గ్రామం నుంచి వస్తున్నారు.. నెల జీతం ఎంత.. సదుపాయాలున్నాయా.. వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు అంతా బాగుందని చెప్పారు. సెల్‌ఫోన్లను కంపెనీ ఎండీ అగర్వాల్ అందజేశారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసి మైక్రోమ్యాక్స్ సెల్‌ఫోన్, ఎల్‌ఈడీ తయారీల యూనిట్‌ను ప్రారంభించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, మైక్రోమ్యాక్స్ కంపెనీ చైర్మన్ రాజేష్ అగర్వాల్, మైక్రోమాక్స్ కంపెనీ వైస్ చైర్మన్ ఎస్‌కె.శర్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు