నగర పారిశుధ్య కార్మికుడికి ప్రధాని అవార్డు..

3 Aug, 2016 00:11 IST|Sakshi
చెత్తను తరలిస్తున్న వెంకటయ్య

రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ సర్కిల్‌–6 జీహెచ్‌ఎంసీ పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుడు టి.వెంకటయ్య జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుధ్య కార్మికుడిగా ఎంపికయ్యారు. ఈ నెల 6వ తేదీన దేశరాజధానిలో నిర్వహించనున్న ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుల చేతులమీదుగా అవార్డు తీసుకో నున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాజేంద్రనగర్‌ సర్కిల్‌ కార్యాలయంలో వెంకటయ్యను ఘనంగా సన్మానించారు.

సౌత్‌జోన్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, సర్కిల్‌ ఉపకమిషనర్‌ దశరథ్, తోటి కార్మికులు, అన్ని విభాగాల అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. గగన్‌పహాడ్‌ ప్రాంతానికి చెందిన టి.వెంకటయ్య 16 ఏళ్లుగా పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య భారతమ్మ, కుమారులు నర్సింహ, జంగయ్య సంతానం. అతడి భార్య, ఒక కుమారుడు కూడా పారిశుధ్య విభాగంలో పనిచేయడం గమనార్హం.  

వెంకటయ్య అంటే హడల్‌...
వెంకటయ్య మోహన్‌రెడ్డినగర్‌తో పాటు బాబుల్‌రెడ్డినగర్, రాఘవేంద్రకాలనీ, సాయిబాబానగర్, మార్కండేయనగర్, వడ్డెరబస్తీలలో పనిచేస్తుంటాడు. ఎవరైనా చెత్త చెదారాలను డస్ట్‌ బిన్‌లో కాకుండా బయట పడేస్తే దాన్ని నేరుగా తీసుకువెళ్లి వారి ఇంటి ముందు పడేస్తాడు. మరోసారి అలా చేయనని హామి ఇస్తేనే దాన్ని తొలగిస్తాడు. అతను అలా చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లోని వారు చెత్తను రోడ్లపై కాకుండా డబ్బాల్లో ఉంచుతున్నారు. ఆ చెత్తను వెంకటయ్య సేకరిస్తాడు. ఎలాంటి డబ్బులు ఆశించకుండా పనిచేస్తాడు. మూడేళ్లుగా ఒక్క సెలవు కూడా తీసుకోకుండా పనిచేస్తున్నాడు. సెలవు తీసుకోమని కోరినా వద్దంటున్నాడని అధికారులు తెలిపారు.

 

మరిన్ని వార్తలు