అక్కరకు రాని ఐదొందల నోట్లు

12 Dec, 2016 15:20 IST|Sakshi
అక్కరకు రాని ఐదొందల నోట్లు
ప్రింటింగ్‌ లోపాలతో వెనక్కి..
 తమకు ఇవ్వాలంటూ నల్లదొరల రాయ’బేరాలు’
 597 బ్యాంక్‌ శాఖలకు రూ.60 కోట్లు విడుదల
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
జిల్లాకు వచ్చిన రూ.500 నోట్లు ప్రజలకు అక్కరకు రాకుండా పోయాయి. నాలుగు రోజుల క్రితమే జిల్లాకు పెద్ద మొత్తంలో రూ.500 నోట్లు వచ్చిన విషయం విదితమే. వాటిలో కొన్ని నోట్లపై ప్రింటింగ్‌ లోపాలు ఉన్నట్టు గుర్తించామని, ఆ కారణంగా వెనక్కి పంపుతున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఆర్‌బీఐకి తిరిగి పంపగా మిగిలిన నోట్లలో రూ.60 కోట్లను మంగళవారం జిల్లాలోని బ్యాంకులకు పంపించారు. ఇంకా సుమారు రూ.150 కోట్ల వరకు నోట్లు ఇక్కడే ఉంచేశారు. వాటిని బ్యాంక్‌ శాఖలకు పంపించవద్దని, తమకు ఇవ్వాలని జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కోరడంతో నిలిపివేశారనే ప్రచారం జిల్లాలో పెద్దఎత్తున సాగుతోంది. జిల్లాలోని 597 బ్యాంక్‌ శాఖలకు రూ.10 లక్షల చొప్పున రూ.60 కోట్లను పంపించగా, బుధవారం నుంచి అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 
 
కమీషన్ల ఎరవేసి మార్చేశారు
ఇప్పటికే చాలామంది ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని బ్యాంకర్ల సహాయంతో మార్చినట్టు సమాచారం. బ్యాంకర్లకు 20 నుంచి 30 శాతం కమీషన్‌ ముట్టచెప్పి పాత నోట్లను మార్చుకున్నట్టు భోగట్టా. పాత నోట్ల మార్పిడిని అడ్డం పెట్టుకుని పెద్దఎత్తున జిల్లాలోనూ, చుట్టుపక్కల జిల్లాల్లో ఈ దందా నడిచింది. హనుమాన్‌ జంక‌్షన్‌లోని ఒక ప్రధాన బ్యాంక్‌ మేనేజర్‌ ఒక చేపల వ్యాపారికి రూ.20 శాతం కమీషన్‌ తీసుకుని రూ.35 లక్షలు ఇచ్చినట్టు సమాచారం. పెద్దగా లావాదేవీలు ఉండని బ్యాంకుల్లో ఛత్తీస్‌గడ్, ఒడిశా, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల వారినుంచి 20 శాతం కమీషన్‌ తీసుకుని పెద్ద ఎత్తున నోట్లను మార్చారు. ఇంకొందరు ప్రజాప్రతినిధులు ఒక అడుగు ముందుకు వేసి దేవుడి హుండీలలో వచ్చిన చిన్న నోట్లను తీసుకుని వాటి స్థానంలో పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేశారు. ఇప్పటికే 80 శాతంపైగా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేశారని సమాచారం. ఎటొచ్చి పేద, మధ్య తరగతి ప్రజలే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజులు గడిచే కొద్దీ ప్రజలకు కష్టాలు పెరుగుతున్నాయి. నిత్యవసర సరుకులు కొనుక్కునేందుకు సైతం సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల వద్ద నిలబడలేక, ఏటీఎంలు పనిచేయక వారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. 21 రోజుల తర్వాత కూడా బ్యాంకుల వద్ద జనం బారులుతీరి ఉంటున్నారు. అక్కడక్కడా పనిచేస్తున్న ఏటీఎంలలో ఇప్పటికీ రూ.2 వేల నోట్లు మాత్రమే వస్తుండటంతో ప్రజల కష్టాలు తీరడం లేదు.
 
మరిన్ని వార్తలు