బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కేనా..

10 Mar, 2017 02:09 IST|Sakshi
బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కేనా..

వ్యవసాయ అనుబంధ  ప్రాజెక్టుల మంజూరుపై ఆశలు
‘ప్రధాన ఆస్పత్రి’   ప్రకటనపై ఉత్కంఠ
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు


వరంగల్‌ రూరల్‌ : రాష్ట్ర బడ్జెట్‌లో వరంగల్‌ రూరల్‌ జిల్లా ఏ మేరకు కేటాయింపులు ఉంటాయన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. వ్యవసాయపరంగా కీలకంగా ఉండడంతో 93.01శాతం గ్రామీణ జనాభా కలిగి ఉన్న జిల్లాలో వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులు, టెక్స్‌టైల్‌ పార్కులు, కూరగాయల మార్కెట్‌ ఏర్పాటుపై ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నందున బడ్జెట్‌ ఏ మేరకు కేటాయింపులు ఉంటాయన్న అంశంపై చర్చ సాగుతోంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా అభివృద్ధిలో కీలకంగా నిలవనున్న ప్రాజెక్టులే కాకుండా ఇతర అంశాలపై కీలకమైన ప్రకటనలు వెలువడుతాయని జిల్లా వాసులు ఆశిస్తున్నారు.

వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం దక్కేనా..
జిల్లాలోని 15మండలాలు పూర్తి గ్రామీణ ప్రాంతాలే. ఇందులో 1,72,463 హెక్టార్లు స్థూల వ్యవసాయ విస్తీర్ణంగా ఉంది. వరి విస్తీర్ణం భారీగా ఉండడమే  కాకుండా మిర్చి, పత్తి, పసుపు, మక్కజొన్న తదితర పంటలు కూడా గణనీయమైన స్థాయిలోనే పండుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గీసుకొండ–సంగెం మండలాల పరిధిలో ఇప్పటికే టెక్స్‌టైల్‌ పార్క్‌ కోసం టీఎస్‌ఐఐసీకి 1,053 ఎకరాలు అప్పగించారు. అదేవిధంగా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్‌ వద్ద కూరగాయల మార్కెట్‌ ఏర్పాటుకు నిర్ణయించారు.

అలాగే, పరకాలలో ఆగ్రోస్‌ సెంటర్‌ మంజూరైంది. దీంతో పాటు ఇక్కడ వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నర్సంపేట నియోజకవర్గంలో మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇందుకోసం ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో 90ఎకరాలు ఇప్పటికే కేటాయించారు. ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ సైతం ఉంది. అదేవిధంగా నర్సంపేట వద్ద ఫుడ్‌పార్క్‌ ఏర్పాటు కోసం సీఎం సూచనల మేరకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ మేరకు ఆయా ప్రాజెక్టులకు సంబంధించి అవసరమైన నిధులను ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయిస్తారని జిల్లా ప్రజలు, రైతులు ఆశిస్తున్నారు.

జిల్లా ఆస్పత్రి ఎక్కడో?
కొత్తగా ఏర్పడిన వరంగల్‌ రూరల్‌ జిల్లాకు జిల్లా కేంద్రం లేకపోవడంతో పాటు ప్రత్యేకంగా జిల్లా ఆస్పత్రి కూడా లేకుండా పోయింది. దీంతో ఇక్కడ జిల్లా ఆస్పత్రి తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు సంబంధించి ప్రజల నుంచి డిమాండ్లు కూడా వెలువడుతున్నాయి. నియోజకవర్గ కేంద్రాలైన వర్ధన్నపేట, నర్సంపేట, పరకాలల్లోని ఏదో ఓ ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా ప్రకటించి.. అందుకు అవసరమయ్యే నిర్మాణాలు, పరికరాల కోసం తాజా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని భావిస్తున్నారు. ఇక మరోవైపు రాష్ట్రంలో 66.54శాతం అక్షరాస్యత ఉండగా, జిల్లాలో 61.26శాతం మాత్రమే ఉంది. ఫలితం అక్షరాస్యత పెంపునకు పాఠశాలల బలోపేతంపై దృష్టి సారించడంతో పాటు నూతన విద్యాసంస్థల మంజూరు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

ప్రాచీన కట్టడాలు, పర్యాటకం...
జిల్లాలో ప్రాచీన కట్టడాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. కాకతీయులు ఏలిన ప్రాంతం కావడంతో జిల్లాలో అనే చోట్ల ప్రాచీన కట్టడాలు కనిపిస్తాయి. ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్‌ కోటగుళ్లు, చంద్రగిరి గుట్టలు అభివృద్ధి చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశముంటుంది. అదేవిధంగా ఖానాపురం మండలంలోని ప్రతిష్టాత్మక పాకాల సరస్సును లక్నవరం తరహాలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో నిధుల కేటాయింపులపై ప్రతిఒక్కరిలో ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు