వరుస చోరీలు చేసి.. జైలుకెళ్లి..

9 Sep, 2017 08:46 IST|Sakshi
శవంపై పడి రోదిస్తున్న తల్లి, సోదరి

జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్య
నిందితుడిపై పలు కేసులు
మానసిక స్థితి బాగోలేకనేనన్నజైలు అధికారులు


నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌ అర్బన్‌) : సారంగపూర్‌ వద్ద ఉన్న జిల్లా జైలులో అండర్‌ ట్రయల్‌ ఖైదీ ఒకరు శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొన ఊపీరితో ఉన్న అతడిని అధికారులు వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిందితుడు చివరిసారిగా నవీపేటలో చోరీ చేసి అరెస్టు అయ్యాడు. ఇతడిని గత మే 16న కోర్టులో హాజరుపరుచగా అప్పటి నుంచి రిమాండ్‌లో ఉన్నాడు. నగరంలోని గాజుల్‌పేట్‌కు చెందిన మక్కల లక్ష్మయ్య, గంగవ్వ చిన్న కుమారుడు మక్కల హన్మంత్‌(24) చదువుకోలేదు. తండ్రి లక్ష్మయ్య మేస్త్రీ పనిచేస్తాడు. హన్మంత్‌ పనిచేయకుండా చోరీలు చేసేవాడు. ఇతడిపై నిజామాబాద్‌ నాల్గోటౌన్, మాక్లూర్, నవీపేట పోలీస్‌స్టేషన్లలో దాదాపు 15 కేసులు ఉన్నట్లు తెలిసింది. కాగా చివరి సారిగా నవీపేట మండలం పోతంగల్‌లో మే 4న హన్మంత్‌తో పాటు ధర్పల్లి సాయిలు సెల్‌ఫోన్లు చోరీ చేశారు. దీనిపై నవీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హన్మంత్‌ను మే 16న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా, కోర్టు రిమాండ్‌కు పంపింది.

అప్పటి నుంచి హన్మంత్‌ జైలులో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం అందరూ ఖైదీలతోపాటు ఇతడిని జైలు ఆవరణలో వదిలారు. వారందరూ వివిధ పనులు చేస్తుండగా మ«ధ్యాహ్నం 2.20 గంటలకు హన్మంత్‌ జైలులోని ఒకటో బ్యారక్‌ వెనుక ఓ చెట్టుకు టెలిఫోన్‌ వైర్‌తో ఉరేసుకున్నాడు. అటువైపు వచ్చిన జైలు అధికారులు కొన ఊపీరితో ఉన్న హన్మంత్‌ను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఖైదీ హన్మంత్‌ సాయంత్రం 5గంటలకు మృతిచెందాడు. దీనిపై జైలు సూపరింటెండెంట్‌ కళాసాగర్‌ ఆరోటౌన్‌ పోలీసులకు తెలుపగా ఎస్‌ఐ లక్ష్మయ్య, రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు ఆస్పత్రికి చేరి కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న మృతుడి తల్లి గంగవ్వ, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరి మృతదేహంపై పడి బోరన విలపించారు.

గతంలో పలుమార్లు ఆత్మహత్యాయత్నం..
అండర్‌ ట్రయల్‌ ఖైదీ హన్మంత్‌ గతంలోనూ పులుమార్లు చో రీలు చేసి జైలుకు వచ్చి వెళ్లాడు. ఆయా సమయాల్లోనూ ప లుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటు జైలు అధికా రులు తెలిపారు. రాళ్లతో చేతులపై, కడుపులో కోసుకునేవాడ ని, బాత్రూం గదుల్లో ఉండే బ్లీచింగ్‌ పౌడర్, ఫినాయిల్‌ తాగి ఆస్పత్రి పాలయ్యాడని అధికారులు తెలిపారు. ఇతడికి వైట్‌నర్‌ తాగే అలవాటు ఉందని, పలుమార్లు వింతగా ప్రవర్తించేవాడని అధికారులు తెలిపారు.