విహారయాత్రలో అపశ్రుతి

20 Dec, 2016 23:22 IST|Sakshi
విహారయాత్రలో అపశ్రుతి
  • కర్నూలు జిల్లాలో ప్రైవేట్‌ బస్సు బోల్తా
  • 15 మంది విద్యార్థులు, టీచర్లకు గాయాలు
  • సంఘటన స్థలం నుంచి పరారైన బస్సు డ్రైవర్‌
  • ఉద్దేహాళ్‌ పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన
  • బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌ జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాల ఉపాధ్యాయులు విహారయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలోని బెలుం గుహలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను ఒప్పించి విహారయాత్రకు పేర్లు నమోదు చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ప్రధానోపాధ్యాయులు ఈశ్వర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఉరవకొండకు చెందిన ప్రైవేట్‌ బస్సులో బయల్దేరారు. వీరిలో ఆరుగురు ఉపాధ్యాయులు, 66 మంది తొమ్మిదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఉద్దేహాళ్‌ నుంచి బయలు దేరిన బస్సు ఉరవకొండ, గుంతకల్లు, గుత్తి, బనగానపల్లి , నంద్యాల మీదుగా మీదుగా వెళుతోంది. విద్యార్థులు సరదాగా జోకులు వేసుకుంటూ ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ఉదయం 8.30 గంటల సమయంలో కర్నూలు జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి వద్దకు రాగానే మలుపు వద్ద బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ హఠాత్పరిణామంతో విద్యార్థులు హాహాకారాలు చేశారు. ప్రాణాలు అరచేత పట్టుకుని  బస్సు నుంచి ఒకరి తర్వాత ఒకరు బయట పడ్డారు. ఎవరికీ ప్రాణహాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అతివేగం వల్లనే బస్సు అదుపు తప్పి, ప్రమాదం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. సంఘటన జరిగిన తర్వాత బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు.

    15 మందికి గాయాలు

    బస్సు బోల్తాపడడంతో 15 మంది గాయపడ్డారు. వీరిలో విద్యార్థులు సుధ (లింగదహాళ్‌), సహానా (ఉద్దేహాళ్‌), ఆశా (లింగదహాళ్‌), తెలుగు పండిట్‌ ప్రశాంతి, హిందీ పండిట్‌ రాజేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక అధికారులు బాధిత విద్యార్థులను సమీపంలోని పాఠశాలకు ఆశ్రయం కల్పించి.. కాసేపటి తర్వాత స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేశారు.

    పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

    ప్రమాద ఘటనను తెలుసుకున్న గౌనూరు, లింగదహాళ్‌ , ఉద్దేహాళ్‌ విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. తమ పిల్లలకు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లకుండా తక్కవ అద్దెకు దొరుకుతుందని, ఇన్సూరెన్స్‌ కూడా లేని ప్రైవేట్‌ బస్సులో తీసుకెళ్లడంలో ఆంతర్యమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విహారయాత్ర వద్దు, ఏమీ వద్దు.. తమ పిల్లలను వెంటనే వెనక్కి పిలుచుకురావాలని డిమాండ్‌ చేశారు.

    విద్యార్థులను వెనక్కు తీసుకొస్తాం

    ‘అనుకోకుండా ప్రమాదం సంభవించింది. కంగారు పడవద్దు. చిన్నపాటి గాయాలు తప్ప ఎవరికీ ప్రాణహాని జరగలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, విద్యార్థులను వెనక్కి రప్పిస్తాం’ అని ఎంఈఓ భీమప్ప విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు