సర్కార్ సొమ్ము.. ప్రైవేట్ సోకు

7 Dec, 2015 00:18 IST|Sakshi
సర్కార్ సొమ్ము.. ప్రైవేట్ సోకు

సాక్షి, హైదరాబాద్: పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడమేకాకుండా వాటికి ప్రభుత్వం సొమ్ము ధారాదత్తం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, మరో రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలను ‘ఈ-వైద్య’ అనే సంస్థ చేతిలో పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇది ప్రైవేటీకరణ కాదని, కేవలం స్వచ్ఛంద సంస్థలకే ఇస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెబుతున్నా సిబ్బంది నమ్మడంలేదు.

పీహెచ్‌సీని ప్రైవేట్ సంస్థకు అప్పగించాక ప్రభుత్వం సంబంధిత సంస్థకు ప్రారంభంలో ఏకమొత్తంగా రూ. 8 లక్షల చొప్పున కట్టబెట్టాలని యోచిస్తోంది. ఆ సొమ్ముకు లెక్కాపత్రాలుండవు. ఈ నిధులతో రిసెప్షన్ కౌంటర్, అందమైన బోర్డుల ఏర్పాటు, పీహెచ్‌సీని ఆధునీకరణ వంటివి చేస్తారు. ఒక రిసెప్షనిస్టును కూడా నియమించే అవకాశం ఉంది. ఇదిగాక నెలవారీ మందులు, నిర్వహణ ఖర్చుల కింద రూ.4.65 లక్షలు ప్రైవేటు సంస్థకు కట్టబెడతార ని తెలిసింది. ఆ సంస్థ నియమించే వైద్యులు, పారామెడికల్, ఇతర సిబ్బంది వేతనాలను ఇందులోంచి ఇస్తారని అంటున్నారు. ప్రజల నుంచి కనీస రుసుం కూడా వసూలు చేసే అవకాశముందని పేర్కొంటున్నారు.
 
 ఇతర వైద్యసేవలపై ప్రభావం

 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రోజువారీ వైద్యసేవలకే పరిమితం కాకుండా వ్యాక్సినేషన్లు, ఇతర వైద్య సేవలను చేపడుతుంటాయి. ప్రైవేటీకరణ చేస్తే ఆ సేవలపైనా ప్రభావం పడుతుందని, ఆ సేవలకు కూడా అదనంగా సొమ్ము వసూలు చేసే ప్రమాదముందని పీహెచ్‌సీ సిబ్బంది అంటున్నారు. ఇప్పటికే పీహెచ్‌సీల్లో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని తొలగించి ప్రైవేటు సంస్థ సొంత నియామకాలు చేపట్టే అవకాశముందని ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు