బాదుడే బాదుడు

30 May, 2017 23:27 IST|Sakshi
బాదుడే బాదుడు

తిరుపతిలో  ప్రయివేటు ట్రావెల్స్‌ దోపిడీ
శని, ఆదివారాల్లో రెట్టింపు చార్జీల వసూలు
పొరుగు రాష్ట్రాల ప్రయాణాలపై భారీ బాదుడు
పనిచేయని పుష్‌బ్యాక్‌ సీట్లు,  ఏసీలతో అవస్థలు


తిరుపతి: తిరుపతిలో ప్రయివేటు బస్సుల దోపిడీ ఎక్కువైంది. టికెట్‌ ధరలను అమాంతం పెంచేశారు. వేసవి సెలవుల్లో సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీల కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా శని, ఆదివారాల్లో ఈ దోపిడీ ఎక్కువైంది. ప్రయివేటు బస్సుల్లో ప్రయాణాలకు అలవాటు పడ్డ ప్రయాణికులు గత్యంతరం లేక ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రయివేటు బస్సుల దందాను పసిగట్టి చర్యలు తీసుకోవాల్సిన రవాణా శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం వల్లే తిరుపతిలో ప్రయివేటు దందా ఎక్కువైందని తెలుస్తోంది.

రోజూ తిరుపతి నుంచి 80 వేల మందికి పైగా దూర  ప్రయాణాలు చేస్తుంటారు. వీరంతా ఆర్టీసీ బస్సుల్లో, ప్రయివేటు ట్రావెల్‌ బస్సుల్లోనూ, మిగతా వాళ్లు రైళ్లల్లోనూ వెళ్తుంటారు. గడచిన నెల రోజుల నుంచి భక్తులతో తిరుమల కొండపై రద్దీ పెరిగింది. రోజూ తిరుమల వచ్చి వెళ్లే భక్తుల సంఖ్య లక్షకు చేరింది. తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నారు. సుమారు 30 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనూ, మరో 40 మంది దాకా రైళ్లల్లోనూ గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఇకపోతే హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, నల్గొండ, గుంటూరు, అమలాపురం, కాకినాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చి తిరుగు ప్రయాణంలో మార్పులు జరిగిన సందర్భాల్లోనే ఎక్కువ మంది ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సులపై ఆధారపడుతున్నారు. దీనికితోడు వేసవి కాలం కావడంతో ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారంతా విధిగా ప్రయివేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు.

దీన్ని ఆసరాగా చేసుకుని ప్రయివేటు ట్రావెల్స్‌ చార్జీల రేట్లు పెంచేశాయి. ఉదాహరణకు రోజూ రాత్రి 9.30 గంటలకు తిరుపతి నుంచి విజయవాడకు వెళ్లే మార్నింగ్‌స్టార్‌ సర్వీసుకు గతంలో రూ.440లు తీసుకునేవారు. శనివారం రాత్రి ఏకంగా «రూ.740లు తీసుకున్నారు. అవేవిధంగా హైదరాబాద్‌ వెళ్లే ప్రయాణికులపై రూ.400 అదనంగా బాదేశారు. ఒక్క మార్నింగ్‌స్టార్‌ మాత్రమే కాకుండా తిరుపతి నుంచి బయలుదేరే అన్ని బస్సులూ రేట్లు పెంచేశాయి. శ్రీనివాస, శ్రీకృష్ణ, వెంకట రమణ, కాళేశ్వరి బస్సులన్నీ వీకెండ్‌ బాదుడు మొదలు పెట్టాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.

ఆర్టీసీ ఆదాయానికి గండి
ప్రయివేటు బస్సులన్నీ ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా నుంచే బయలుదేరుతున్నాయి. రోజూ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఈ బస్సులు అంబేడ్కర్‌ సర్కిల్, ఈస్ట్‌పోలీస్‌ స్టేషన్ల మధ్య ప్రయాణికుల్ని ఎక్కించుకుంటున్నాయి. రోజూ 80 సర్వీసులు ఇక్కడి నుంచి బయలుదేరతాయి. సుమారు రూ.2 లక్షల ఆర్టీసీ ఆదాయాన్ని లాగేసుకుంటున్నాయి. పైగా చాలా బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. రూట్‌ పర్మిట్లు లేనివి కొన్నయితే, దాదాపు సగానికి సగం స్టేజీ క్యారియర్లుగా నడుస్తున్నాయి. ఆన్‌లైన్‌ బుకింగ్, టికెట్‌ల జారీ పద్ధతిలో ప్రయాణికులను దోచుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ల నేతలు ప్రయివేటు బస్సుల విషయాన్ని లేవనెత్తారు. ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా కాకుండా కిలోమీటరు దూరాన బస్సులను ఆపుకుని ప్రయాణికులను ఎక్కించుకోవాలని ఆర్టీసీ కోరింది. ఎస్పీ జయలక్ష్మి జోక్యంతో కొన్ని రోజుల పాటు అలా జరిగినా తర్వాత మళ్లీ బస్టాండ్‌ దగ్గరే ఆపుతున్నారు.
 

మరిన్ని వార్తలు