ఎన్టీటీపీఎస్‌పై ప్రైవేటీకరణ కత్తి

29 Sep, 2016 20:31 IST|Sakshi
ఎన్టీటీపీఎస్‌పై ప్రైవేటీకరణ కత్తి
– ఉత్పత్తిని అందుకే తగ్గించారు 
– వేలాది కార్మికుల శ్రమను 
  బూడిదలో పోయొద్దు 
– ఏఐటీయూసీ నేత కోటేశ్వరరావు 
 
విజయవాడ (ఇబ్రహీంపట్నం): 
ఎన్టీటీపీఎస్‌ సంస్థను ప్రైవేటీకరించబోతున్నారనే సందేహంతో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ కోటేశ్వరరావు అన్నారు. ఇబ్రహీంపట్న ఏఐటీయూసీ భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్టీటీపీఎస్‌ నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారు. 1760 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిచేసే సంస్థ ప్రస్తుతం కేవలం 700 మెగావాట్లనే ఉత్పత్తి చేస్తోందని అన్నారు.  సుమారు 5వేలమంది కార్మికులు అహర్నిశలు పనిచేసి అనేక అవార్డు సాధించిన పరిశ్రమను దెబ్బతీసే కుట్రను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.
అమ్మేది చవక... కొనేది ఖరీదు 
 సుమారు 1,000 మెగావాట్ల ఉత్పత్తిని నిలిపివేసి ప్రైవేట్‌ సంస్థల నుంచి యూనిట్‌ రూ.4.80తో కొనుగోలు చేయటం వలన ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసినట్లు ఉద్యోగుల్లో అనుమానాలు బలపడుతున్నాయని ఆరోపించారు. ప్లాంటులో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను రూ.1.45 ఆపైన విక్రయిస్తూ, ప్రైవేట్‌ సంస్థలకు అధికధర చెల్లించి కొనుగోలు చేయటం ఏమిటని గట్టిగా ప్రశ్నించారు. సమావేశంలో మైలవరం నియోజకవర్గం కార్యదర్శి బుడ్డి రమేష్, జిల్లా రైతుసంఘం అధ్యక్షుడు మల్నీడు యల్లమందా రావు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు