ఓపికకు ‘పరీక్ష’

4 May, 2017 23:45 IST|Sakshi
ఓపికకు ‘పరీక్ష’

– సమస్యల నడుమ ఏపీఆర్‌జేసీ, డీసీ ప్రవేశ పరీక్ష
– సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలం
– కనీసం తాగునీరు అందుబాటులోలేని వైనం


అనంతపురం ఎడ్యుకేషన్‌ : ‘ఏ ఒక్క కేంద్రంలోనూ ఫర్నీచరు సమస్య తలెత్తకూడదు. ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చుని రాయకూడదు. ఎక్కడైనా కేంద్రంలో ఫర్నీచరు లేకపోతే పరీక్ష రోజు ఉదయం 6 గంటలలోపు సమాచారం అందించినా పరీక్షా ప్రారంభ సమయానికి ఫర్నీచరు ఏర్పాటు చేస్తాం. అంతే తప్ప ప్రతి కేంద్రంలోనూ విధిగా ఫర్నీచరు ఉండాల్సిందే’...ముందురోజు జిల్లా రెవెన్యూ అధికారి మల్లీశ్వరిదేవి చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులకు జారీ చేసిన ఆదేశాలు. అయితే ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2017–18 విద్యా సంవత్సరం ప్రవేశాలకు గురువారం నిర్వహించిన పరీక్ష నిర్వహణలో ఈ ఆదేశాలు అమలుకాలేదు.

విద్యార్థుల ఓపికకు పరీక్షలా మారింది. కనీస సదుపాయాలు కూడా కరువవడంతో విద్యార్థులు అల్లాడారు. మొత్తం 10,593 మంది విద్యార్థులకు గాను 9,669 మంది విద్యార్థులు హాజరయ్యారు. 924 మంది గైర్హాజరయ్యారు. 45 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరిగింది. విద్యార్థులు 9 గంటల నుంచే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి మల్లీశ్వరిదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందునాయక్, ఏపీఆర్‌జేసీ,డీసీ పరీక్ష కోఆర్డినేటర్‌ వాసుదేవరెడ్డి పర్యవేక్షించారు.

తాగునీరు కరువు
అసలే ఎండాకాలం తాగేందుకు నీరు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కొన్ని కేంద్రాల్లో అరకొరగా తాగునీరు సదుపాయం కల్పించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్యంగా విద్యార్థినులకు తోడుగా బంధువులు వచ్చారు. కేంద్రాల వద్ద నీరు దొరకక వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు లేకపోవడంతో పరీక్ష ప్రారంభమైనçప్పటి నుంచే విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు.  ఫర్నీచరు లేక చాలా కేంద్రాల్లో విద్యార్థులు నేలపై కూర్చునే రాశారు.  పరీక్ష ముగిసే సమయానికి మిట్టమధ్యాహ్నం కావడంతో ఊళ్లకు చేరుకునేందుకు విద్యార్థులు భగభగ  మండుతున్న ఎండకు తట్టుకోలేక ఇబ్బంది పడ్డారు.

మరిన్ని వార్తలు