క్యాష్.. రష్!

17 Nov, 2016 01:00 IST|Sakshi
క్యాష్.. రష్!

పెద్ద నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని వారం రోజులు దాటినా సామాన్యులు కరెన్సీ కష్టాల నుంచి గట్టెక్కలేదు. నగదు ఉపసంహరణ, నోట్ల మార్పిడి కోసం మంగళవారం కూడా బ్యాంకులు, ఏటీఎంల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. చంటిబిడ్డలతో వచ్చిన తల్లులు, నిరక్షరాస్యులైన వృద్ధులు గంటలకొద్దీ క్యూలో నిలబడలేక నరక యూతన అనుభవించారు.
 

 ఒక్క నోటు ఎసట్లో బియ్యం ఉడికిస్తుంది
 ఒక్క నోటు కాలే కడుపులో పప్పు చారు పోస్తుంది
 ఒకే ఒక్క నోటు స్కూల్లో పిల్లాడికి చాక్లేటు ఇచ్చి
 ఉబికి వస్తున్న కన్నీళ్లకు అడ్డుకట్ట వేస్తుంది
 ఒక్క వంద ఓ పేద కుటుంబానికి
 అండగా.. నీడగా..ఆనందంగా మారుతుంది
 ఇప్పుడు అదే నోటు సామాన్యులను
 రోడ్ల వెంట పిచ్చివాళ్లలా తిప్పుతోంది
 కష్టపడి.. చెమటోడ్చి.. రక్తాన్ని పెట్టుబడిగా
 పెడితే వచ్చిన పెద్దనోటే
 వాళ్ల కడుపు మీద కొడతానంటూ బెదిరిస్తోంది
 1..2..3..4..5..6..7 ఇలా రోజులు దొర్లిపోతూనే ఉన్నారుు
 కష్టజీవులకు పని పోరుుంది.. ఉద్యోగులకు సెలవు పోరుుంది
 రోజంతా బ్యాంకులవద్ద ఆపపోపాలు పడటమే మిగిలింది!
 కరెన్సీ కష్టాలు జిల్లాలో రోజురోజుకూ ఎక్కువవుతున్నారుు! - ఒంగోలు

 

ఒంగోలు: కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాంకుల్లో సరిపడినంత నూతన కరెన్సీ నిల్వలు లేక పోవడం గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రతి ఒక్కరూ క్యూల్లో పడిగాపులు కాస్తున్నారు. ఉద్యోగులు అయితే డ్యూటీలకు వెళ్లాలో లేక క్యూలో నిలబడాలో అర్థంకాక సతమతం అవుతున్నారు. రూ. 24వేల వరకు ఒకేసారి నగదు డ్రాచేసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు సడలించినా అందులో ఎక్కువ మొత్తంలో రూ. 2వేల నోట్లే ఇస్తున్నారు. అయితే అవి మార్చుకునే సౌలభ్యం లేకపోవడంతో మరింత టెన్షన్ కొనసాగుతోంది.
 
ఇదీ పరిస్థితి
బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో పాత కరెన్సీనోట్లు పోగవుతున్నారుు. అరుుతే ప్రజల దైనందిన కార్యక్రమాలకు సమస్యలు వచ్చి పడ్డాయి. వ్యాపారులు అయితే రోజువారీ లావాదేవీలకు చిక్కులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు బ్యాంకర్లు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బ్యాంకుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. భారీ డిపాజిట్ల దెబ్బకు వాటికి సంబంధించిన వివరాలను సరిచూసుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఇదే క్రమంలో కొంతమంది వ్యక్తులు బ్యాంకర్లకు ఫోన్లు చేసి తమ వద్ద  ఉన్న నగదును మార్చి పెట్టాలని.. లేదంటే భవిష్యత్తులో డిపాజిట్లు విత్‌డ్రా చేసుకుంటామని స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది.
 
ఇక ఏటీఎంల వద్ద పరిస్థితిలో ఏ మాత్రం మార్పు కనిపించడంలేదు. ప్రకాశం జిల్లా సహకార కేంద్రబ్యాంకు సీఈవో కుంభా రాఘవయ్య స్టేట్‌బ్యాంక్ అధికారులను, జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించి తమ పరిస్థితిని వివరించారు. తమకు దాదాపు రూ. 80 కోట్ల డిపాజిట్లు వచ్చాయని, ఖాతాదారులకు నగదు ఇచ్చేందుకు మాత్రం సమస్యగా ఉందని పేర్కొన్నారు. కనీసం రూ. 5కోట్లు అత్యవసరంగా అందించి..  రోజుకు రూ. 2కోట్లు చొప్పున నూతన కరెన్సీ ఇస్తే తప్ప ఖాతాదారులకు సేవలు అందించలేమని చెప్పారు. అయినా ఎటువంటి హామీ రాకపోవడంతో బుధవారం నేరుగా ఎస్‌బీఐ గుంటూరు డీజీఎంను కలుసుకొని తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరనున్నారు.
 
ఆర్టీసీకి భారీగా తగ్గిన ఆదాయం

ఒక వైపు దైనందిన అవసరాలకే నగదు లేకపోవడంతో ప్రజలు ప్రయాణాలను గణనీయంగా తగ్గించుకున్నారు. పాత నోట్లను చిన్న , మధ్య తరగతి వర్గాలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్నాయి. దీంతో మార్కెట్లో కరెన్సీ అత్యవసర పరిస్థితి నెలకొంది. కొత్త నోట్లు వచ్చాయనుకున్నా అవి రూ. 2వేల నోట్లు కావడంతో దేనికీ పనికి రావడంలేదు. జిల్లావ్యాప్తంగా సరాసరిన ఆరు రోజుల్లో ఆర్టీసీ రూ. 1.20 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు అంచనా. ఒంగోలు రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లోనే రోజుకు లక్ష రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. జనరల్ టిక్కెట్ల వద్ద  పదిరూపాయల టికెట్‌కు సైతం రూ. 500 ఇస్తుండడంతో సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటోంది. పోలీసుల సాయంతో టికెట్ల పంపిణీ కార్యక్రమం నడుస్తోంది.

రూ. 500 నోట్లకు మరో 2 రోజులు
రూ. 500 నోట్లు మంగళవారం రాత్రికి జిల్లాకు చేరుతాయని అధికారులు భావించినా మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నోట్లు వస్తే చిల్లర సమస్యకు  పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఆంధ్రాబ్యాంకు డీజీఎం కె.ఎస్.పి.వి. రమణ మూర్తి తమ సిబ్బందిని మంగళ, బుధవారాల్లో రోజుకు రెండు గంటలపాటు అదనంగా సేవలు అందించాలని ఆదేశించడంతో స్థానిక కోర్టు స్ట్రీట్ బ్రాంచి ఉదయం ఒక గంట, సాయంత్రం మరో గంట అదనంగా సేవలు అందించాయి.

మరిన్ని వార్తలు