వేతన యాతన

12 Dec, 2016 15:10 IST|Sakshi
వేతన యాతన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా ప్రజలంతా ఒకటో తారీఖు కష్టాలు ఎలా ఉంటాయో చవిచూశారు. ఎవరికీ ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా.. అలాంటి చర్యలు ఎక్కడా మచ్చుకైనా కానరాలేదు. జీతాలు తీసుకునేందుకు ఉద్యోగులు, పింఛను సొమ్ముల కోసం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద నో క్యాష్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. నగదు ఉన్న  బ్యాంకుల వద్ద పెద్దఎత్తున జనం బారులు తీరారు. అవసరం మేరకు నగదు నిల్వలు లేకపోవడంతో ఆ మొత్తాలను సర్దుబాటు చేయడానికి బ్యాంకర్లు ఇబ్బంది పడ్డారు. ‘నో క్యాష్‌’ బోర్డులు పెట్టడంతో ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులో ఉదయం వేళ అన్ని ఏటీఎంలు మూతపడే ఉన్నాయి. 10 గంటల తర్వాత కొన్ని ఏటీఎంలలో నగదు పెట్టినా గంటలోనే అయిపోయింది. ఉద్యోగులు నెలవారీ ఖర్చుల కోసం నగదు తీసుకునేందుకు రావడంతో బ్యాంకులు కిటకిటలాడాయి. తర్వాత డబ్బులు ఉంటాయో లేవో అన్న భయంతో ఉదయం 9 గంటల నుంచే బ్యాంకుల ముందు ఉద్యోగులు బారులు తీరారు. తీరా బ్యాంకు తెరిచిన తరువాత డబ్బులు లేవని చెప్పడంతో నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఎస్‌బీఐతోపాటు కొన్ని బ్యాంకులు నగదు చెల్లింపులు చేయగా, ఆంధ్రాబ్యాంక్‌ మాత్రం ఈ రోజు నగదు లేదు అంటూ బోర్డులు పెట్టింది. ఆ బ్యాంకులకు అనుసంధానంగా ఉన్న ఏటీఎంలు కూడా పనిచేయని పరిస్థితి కనిపించింది. చాలాచోట్ల రూ.4 వేలకు మించి నగదు ఇవ్వలేదు. ఉద్యోగులకు రూ.10 వేల చొప్పున ఇచ్చే ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించినా డబ్బులు లేవంటూ బ్యాంకర్లు రూ.4 వేలతో సరిపెట్టారు. 
నరకం చూసిన పింఛనుదారులు
పింఛన్ల కోసం బ్యాంకులకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు చాలా ఇబ్బందులు పడ్డారు. ‘అధికారులేమో పింఛన్‌  సొమ్ము బ్యాంకుల్లో వేశామంటారు. బ్యాంకులకు వెళ్తే డబ్బులు లేవని బోర్డు పెట్టారు. కనీసం మా అకౌంట్‌లో డబ్బులు పడ్డాయో లేదో కూడా తెలియదు. పంచాయతీ ఆఫీసులో ఇవ్వాల్సిన పింఛను డబ్బును ఇప్పుడు చెప్పా పెట్టకుండా ఖాతాల్లో వేస్తే మేం బ్యాంకుల ముందు ఎలా పడిగాపులు పడాలి’ అంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.వెయ్యి, రూ.500 నోట్లు లేకపోవడంతో పింఛను సొమ్ము ఎలా చెల్లించాలో అర్థంకాక బ్యాంకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పలుచోట్ల ఇద్దరికి కలిపి రూ.2 వేల నోటు ఇచ్చి బయట మార్చుకోవాలని చెప్పారు. బ్యాంకులోనే చిల్లర లేకపోతే బయట ఎక్కడ దొరుకుతుందని వృద్ధులు వాపోతున్నారు. బ్యాంకుల వద్ద వృద్ధులు, వికలాంగులకు సాయం చేయడానికి ప్రభుత్వం వైపు నుంచిగాని, బ్యాంకుల నుంచి గాని ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల్లో సొమ్ములు వేసి చేతులు దులుపుకుంది. గతంలో అనారోగ్యం, వృద్ధాప్యంతో బాధపడే పింఛనుదారులకు నేరుగా వారి ఇళ్లకు వెళ్లి సొమ్ము అందజేసేవారు. ఈసారి ఆ పరిస్థితి లేకుండాపోయింది. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో బ్యాంకులకు వెళ్లి పింఛన్‌  ఎలా తీసుకోగలమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా, నల్లజర్ల మండలం అనంతపల్లి ఆంధ్రాబ్యాంక్‌ వద్ద పడమర చోడవరం గ్రామానికి చెందిన వృద్ధుడు ఓంకారపు నాగేశ్వరరావు క్యూ లైన్‌ లో కళ్లు తిరిగిపడిపోవడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతణ్ణి ఆసుపత్రికి తరలించారు. 
రేషన్‌  షాపుల 
వద్దా ఇదే పరిస్థితి
నిత్యావసర సరుకుల కోసం రేషన్‌  దుకాణాల వద్ద కూడా జనం బారులు తీరారు. ఈ పోస్‌ అనుసంధాన ప్రక్రియ పద్ధతిలో కార్డుదారులకు అరువు ప్రాతిపదికన సరుకులు ఇచ్చారు. ఈ ప్రక్రియలో అనుభవం లేనివారు నానా ఇబ్బందులు పడ్డారు. 
 
 
మరిన్ని వార్తలు