బోధన వద్దు.. జీతం ముద్దు

12 Dec, 2016 15:05 IST|Sakshi
బోధన వద్దు.. జీతం ముద్దు

విధులు నిర్వర్తించకుండానే వేతనం
ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో చోద్యం
రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేక గాడి తప్పిన నిర్వహణ
విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు

 
ఆదిలాబాద్ టౌన్ : సమాజంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉన్న గౌరవం మరొకరికి లేదు. విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన కొందరు లెక్చరర్లు ఆ వృత్తికే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. వేలాది రూపాయలు వేతంగా పొందుతూ ఆ వృత్తికి న్యాయం చేయకపోతున్నారు. సర్కారు కళాశాలల్లో చేరేది పేద విద్యార్థులు. వారికి నాణ్యమైన విద్యనందించి ఉన్నత స్థితిలో నిలపాల్సిన లెక్చరర్లు కొందరు కళాశాలకు రాకుండా డుమ్మా లెక్చరర్లుగా మారారు. జీతం మాత్రం తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ వ్యవహారం కొన్నేళ్లుగా సాగుతోంది. కళాశాలలో కొన్నేళ్లుగా పాఠాలు చెప్పని లెక్చరర్లు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. సైన్‌‌స గ్రూప్ విద్యార్థులకు బోధించే ఓ పార్ట్‌టైం లెక్చరర్ 1995 సంవత్సరం నుంచి కళాశాలలో పని చేస్తున్నాడు. కానీ ఏనాడూ విద్యార్థులకు పాఠాలు చెప్పిన దాఖలాలు లేవు.

సదరు అధ్యాపకుడు తనకు నచ్చినప్పుడు వచ్చి హాజరు పట్టికలో దర్జాగా సంతకం చేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. సైన్‌‌స విద్యార్థులు సైతం లెక్చరర్‌ను గుర్తుపట్టకపోవడం ఆయన పనితీరుకు నిదర్శనం. ఆయనతోపాటు కళాశాలలో పని చేసే మరో ఇద్దరు కాంట్రాక్టు లెక్చరర్లు కూడా సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ప్రైవేటు సంఘాల్లో తిరుగుతూ కాలం వెళ్లదీస్తున్నారు. కానీ వేతనం మాత్రం పొందుతున్నారు. నిబంధనల ప్రకారం రెగ్యులర్ లెక్చరర్లతోపాటు కాంట్రాక్టు లెక్చరర్లు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు కళాశాలలోనే ఉండాలి. కానీ మధ్యాహ్నం దాటితే సగం మంది లెక్చరర్లు కళాశాలలో కనిపించరు. లెక్చరర్లు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు చేసేదేమీ లేక ఇంటిముఖం పడుతున్నారు.

గాడితప్పిన నిర్వహణ..
కొన్నేళ్లుగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కొందరు లెక్చరర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కళాశాలకు వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించడం లేదనే ఆరోపణలూ ఉన్నారుు. జిల్లాలోనే పెద్ద డిగ్రీ కళాశాల. ఇందులో దాదాపు 1500 మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 32 మంది రెగ్యులర్ లెక్చరర్లు, ఏడుగురు కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్నారు. సైన్‌‌స గ్రూప్ తరగతులు ఓ మాదిరిగా జరుగుతుండగా.. ఆర్‌‌ట్స గ్రూప్ తరగతులు నామమాత్రంగా సాగుతున్నారుు. కళాశాలకు వచ్చిన విద్యార్థులు ఆవరణలోని చెట్ల కింద కాలక్షేపం చేస్తున్నారు. కళాశాలలో కొంతమంది లెక్చరర్లు, ప్రిన్సిపాల్‌కు మధ్య విబేధాలున్నాయని సమాచారం.

లెక్చరర్ల బాహాబాహీ..!
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఇద్దరు లెక్చరర్లు కళాశాలలో బాహాబాహీకి దిగినట్లు తెలిసింది. సైన్‌‌స విభాగానికి చెందిన ఇద్దరు లెక్చరర్లు మూడు రోజుల క్రితం విద్యార్థుల సమక్షంలోనే గొడవ పడ్డట్లు తెలిసింది. వీరి పంచారుుతీ పోలీసుస్టేషన్ వరకు వెళ్లి ఒకరిపై ఒకరు కేసులు కూడా నమోదు చేసుకున్నట్లు సమాచారం. విధులకు సరిగా హాజరు కానీ లెక్చరర్లలపై, కళాశాలలో నిర్వహణ తీరుపై ఉన్నత విద్యాశాఖ కమిషనర్ రాజీవ్ ఆచార్యకు కళాశాల విద్యార్థులు, కొంతమంది లెక్చరర్లు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ విచారణ చేపట్టాలని కళాశాల ప్రిన్సిపాల్ అశోక్‌కు ఆదేశాలు జారీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ కాకుండా వేరే వారిని విచారణ అధికారిగా నియమించాలని కొందరు లెక్చరర్లు కోరుతున్నారు.
 
విచారణ చేపడుతున్నాం..
కళాశాలకు ఒక పార్ట్ టైం లెక్చరర్ విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఫిర్యాదు వెళ్లడంతో విచారణ చేపట్టాలని ఆదేశాలు వచ్చారుు. కళాశాలలో విచారణ జరిపి నివేదికను కమిషనర్‌కు సమర్పిస్తాం. కళాశాలలో ఇద్దరు లెక్చరర్ల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. - అశోక్, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్

మరిన్ని వార్తలు