ఏదీ సంక్షేమం?

9 Aug, 2016 22:56 IST|Sakshi
టేక్మాల్‌ ఎస్సీ హస్టల్‌
  • హాస్టల్‌ విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకోని అధికారులు
  • తాగునీటికీ తిప్పలే.. నిరుపయోగంగా మరుగుదొడ్లు
  • టేక్మాల్‌: విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. కోట్లు వెచ్చిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తోంది. అయితే  క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టల్‌ విద్యార్థుల ఇబ్బందులు వర్ణనాతీతం. అయినా సంభందిత అధికారులు పట్టనట్లుగా వ్యవరిస్తున్నారు.

    టేక్మాల్‌ ఎస్సీ హస్టల్‌లో మౌలిక సదుపాయాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి బోరు సరిగ్గా పని చేయకపోవడంతో తాగునీటి నానా తిప్పలు పడుతున్నారు. నిల్వ ఉంచిన అపరిశుభ్రమైన నీటిని తాగడంతో విద్యార్థులు అనారోగ్యాలపాలవుతున్నారు.  మరుగుదొడ్లలో నీటి వసతి లేకపోవడం, శుభ్రం చేయకపోవడంతో కంపుకొడుతున్నాయి.  దీంతో విద్యార్థులు చెంబులు పట్టుకొని మైదానాల్లోకి వెళుతున్నారు.

    హాస్టల్‌ ఆవరణ, పరిసర ప్రాంతాల్లో చెత్తా చెదారం ఉండడంతో క్రిమికీటకాలకు ఆవాసంగా మారింది. హాస్టల్‌లో ఫ్యాన్లు సరిగా తిరగకపోవడంతో దోమల బెడద పెరిగింది. విద్యార్థులు చదువుకోవాలన్నా, పడుకోవాలన్నా వసతి సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    భోజనంలో మెనూ పాటించకపోవడంతో వంటలు  రుచిగా ఉండడంలేదని విద్యార్థులు వాపోతున్నారు.  పలుమార్లు తమ సమస్యలను అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదన్నారు. ఇకనైనా సంభందిత అధికారులు స్పందించి  తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

    చుట్టపు చూపుగా వస్తున్న వార్డెన్‌
    స్థానికంగా ఉంటూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ఎస్సీ హాస్టల్‌వార్డెన్‌ చుట్టపు చూపుగా వస్తున్నారు. ఆయన ఎప్పుడూ వస్తున్నారో  ఎప్పుడూ వెళుతున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది.  దీంతో విద్యార్థుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.  వార్డెన్‌ విధులకు ఎగనామం పెట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి.

మరిన్ని వార్తలు