ఎమర్జెన్సీ కాల్స్‌లో అసభ్య పదజాలం

6 Mar, 2017 00:05 IST|Sakshi
ఎమర్జెన్సీ కాల్స్‌లో అసభ్య పదజాలం

విజయవాడ : టెలిఫోన్‌లో మహిళా సిబ్బందిని టార్గెట్‌ చేసి అసభ్యకరంగా వేధిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన నిందితుడిని విజయవాడ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పోలీసు కంట్రోల్‌రూంలో లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ పాల్‌రాజు శనివారం విలేకరులకు తెలిపారు. డయల్‌ 100, 108, 104 నెంబర్లకు ఓ వ్యక్తి నిరంతరం కాల్స్‌ చేస్తూ మహిళల గొంతు వినగానే అసభ్యకరంగా మాట్లాడేవాడు. మహిళా కానిస్టేబుల్స్, 104, 108 సిబ్బందిని కూడా ఇదే విధంగా వేధించాడు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన లారీ డ్రైవర్‌ డేగపాటి మురళి విజయవాడ పోలీసు కంట్రోల్‌ రూంకు గత 20 రోజుల్లో 298 కాల్స్‌ చేసి మహిళా కానిస్టేబుల్స్‌తో అసభ్యకంగా మాట్లాడాడు.

ఈ క్రమంలో పోలీస్‌ సిబ్బంది అతని కాల్స్‌పై నిఘా పెట్టి వాయిస్‌ రికార్డు చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై 509, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీసు కంట్రోల్‌ రూంకు కాల్‌ చేసి మాట్లాడిన మాటల రికార్డులను మీడియాకు వినిపించారు. నిందితుడు మురళీకి కౌన్సెలింగ్‌ నిర్వహించారు.  

అనవసరంగా కాల్స్‌ చేస్తే చర్యలు
డయల్‌ 100, 104, 108, ప్రభుత్వ సర్వీసులను దుర్వినియోగం చేసే విధంగా అనవసరంగా కాల్స్‌ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు కంట్రోల్‌రూంలో లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ పాల్‌రాజు హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీలు వెంకటరమణ, కె. శ్రీనివాస్, ఇతర పోలీసులు అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు