మామిడి ఎగుమతులతో అధికాదాయం

19 Jul, 2016 23:01 IST|Sakshi
మామిడి ఎగుమతులతో అధికాదాయం
  • రైతులకు అన్ని విధాలా సహకారం అందిస్తాం 
  • అపెడా జాతీయ బోర్డు సభ్యుడు జయపాల్‌రెడ్డి
  • జగిత్యాల అగ్రికల్చర్‌ : మేలురకం మామిడి ఎగుమతులతో రైతులు అధికాదాయం పొందవచ్చని అపెడా (అగ్రికల్చర్‌ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రోడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ) జాతీయ బోర్డు సభ్యుడు జయపాల్‌రెడ్డి అన్నారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో అపెడా ఆధ్వర్యంలో మామిడి దిగుబడులు–ఎగుమతులు–నాణ్యతా ప్రమాణాలు అనే అంశంపై మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మన దేశం నుంచి ఎక్కువగా అరబ్‌ దేశాలైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఓమన్‌ తదితర దేశాలకు మామిడి ఎగుమతి అవుతున్నట్లు చెప్పారు. జగిత్యాల ప్రాంతంలో పండే మామిడికాయలు మంచి నాణ్యత కలిగి ఉన్నప్పటికి ఎగుమతి అవకాశాలపై రైతులు పెద్దగా అలోచించడం లేదన్నారు. తోటలను దళారులకు లీజుకు ఇవ్వడం వల్ల రైతులకు ఆశించిన ఆదాయం రావడం లేదన్నారు. రైతులు సంఘటితంగా ఉండి ఎగుమతులపై దృష్టిసారించాలని, ఇందుకు అపెడా తరఫున సహకారం అందిస్తామని పేర్కొన్నారు. రైతులు తమ పేర్లను అపెడాలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. 
    సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ భగవాన్‌ మాట్లాడుతూ.. మామిడి కాయలు తెంపిన తర్వాత కొమ్మ కత్తిరింపు, సేంద్రియ, రసాయన ఎరువులు వేసుకోవడం, పురుగులు రాకుండా ఒక్కసారి మందులు కొడితే 80 శాతం యాజమాన్యం పూర్తయినట్లేనని వివరించారు. చాలామంది రైతులు తొలుత చేయాల్సిన పనులను విడిచిపెట్టి, పూత సమయంలో మందులు వాడుతున్నారని, దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిపారు. మామిడితోటలకు ఏడాదికి మూడుసార్లు పురుగుమందులు పిచికారి చేస్తే సరిపోతుందని చెప్పారు. 
    పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ... ఎగుమతులకు సంబంధించిన పరిజ్ఞానం రైతులకు అందుబాటులో లేనందున ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారికి తగిన సహాయ సహకారాలు అందించేందుకు అపెడా ముందుకురావడం సంతోషమన్నారు. అపెడా ప్రతినిధి శశికాంత్‌ మాట్లాడుతూ.. అయా దేశాల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను పంపించాల్సి ఉంటుందని చెప్పారు. మామిడి ఎగుమతుల్లో థాయిలాండ్‌ ప్రథమ స్థానంలో ఉండగా, భారత్‌ 9వ స్థానంలో ఉందన్నారు. దేశంలోని 15 రాష్ట్రాల్లో అపెడా క్లష్టర్‌లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 
    ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సంగీతలక్ష్మి మాట్లాడుతూ... అపెడాలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనుకున్న రైతులు అయా డివిజన్లలోని ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. మామిడితోపాటు పూలు, ఇతర పండ్లు విదేశాలకు అపెడా ద్వారా ఎగుమతి చేసుకోవచ్చని తెలిపారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జ్యోతి మాట్లాడుతూ.. జిల్లాలో 70 వేల ఎకరాల్లో మామిడితోటలు ఉన్నాయని, మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. జగిత్యాల ఏడీ మరియన్న మాట్లాడుతూ.. మామిడి రైతులకు అధిక అదాయం సమకూర్చలన్న ఉద్దేశంతోనే నూతన టెక్నాలజీని పరిచయం చేస్తున్నామన్నారు. సదస్సులో శాస్త్రవేత్తలు వెంకటయ్య, వేణుగోపాల్, నిర్మల, జిల్లాలోని ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.  
     
     
మరిన్ని వార్తలు