లాభసాటి సాగే లక్ష్యం

1 Sep, 2016 18:29 IST|Sakshi
సదస్సులో మాట్లాడతున్న జెడ్పీ సీఈఓ వర్షిణి
  • ‘సేంద్రియం’తోనే సాధ్యం
  • తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం
  • రైతులకు ప్రోత్సాహం.. ఎల్లవేళలా సలహాలు, సూచనలు
  • జెడ్పీ సీఈఓ వర్షిణి
  • సంగారెడ్డి జోన్‌: సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా సాగును లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందని జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి అలుగు వర్షిణి అన్నారు. గురువారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా ఉద్యానశాఖ, యూఎన్‌డీపీ(యునైటెడ్‌ నేషన్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు) సంయుక్త ఆధ్వర్యంలో సేంద్రియ విధానంలో కూరగాయాలు, పండ్లతోటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

    కార్యక్రమంలో పాల్గొన్న  జడ్పీ సీఈవో మాట్లాడుతూ మెదక్‌ జిల్లాలో  యూఎన్‌డీపీ సహకారంతో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగును ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు. రైతులు పురాతన పద్ధతిలో ఉన్న విధానాలకు స్వస్తి చెప్పి, రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూసారం దెబ్బతినడంతోపాటు ఆరోగ్యం కలుషితమవుతోందన్నారు. రైతులు సేంద్రియపద్ధతిలో వ్యవసాయం చేపట్టాలని  సూచించారు.

    వ్యవసాయ అనుబంధశాఖల అధికారులు సేంద్రియ విధానంపై రైతులకు ఎల్లవేళలా అవగాహన కల్పిస్తూ అందుబాటులో ఉండి ప్రోత్సహించాలని ఆమె కోరారు. ఈ విధానం ద్వారా రైతులు పండించిన పంటలకు వ్యవసాయ అనుబంధశాఖల అధికారులు మార్కెటింగ్‌ సౌకర్యాలపై భరోసా ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న యూఎన్‌డీపీ డైరెక్టర్‌ దిబ్యాసింగ్‌ మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

    వ్యవసాయ రంగంలో క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడేందుకు తమ సంస్థ ప్రోత్సహిస్తుందన్నారు. మహిళా రైతులను పెద్ద ఎత్తున్న భాగస్వాములను చేసి కూరగాయాల సాగు కోసం సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నట్లు తెలిపారు. రాజధానిలో ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేసి రిలయన్స్, మోర్‌ తదితర సంస్థల ద్వారా సేంద్రియ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు.

    ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రామలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో 42,594 హెక్టార్లలో అన్ని రకాల కూరగాయాల సాగు చేస్తుండగా.. 8 లక్షల 58 వేల టన్నుల ఉత్పత్తి జరుగుతున్నట్లు వివరించారు. 50 శాతం సబ్సిడీతో హార్టికల్చర్‌శాఖ ద్వారా రైతులకు కూరగాయలు, పండ్లతోటల సాగుకు ప్రోత్సాహం అందించిన్నట్లు ప్రజెంటెషన్‌ ద్వారా హార్టికల్చర్‌ సాగు విధానాన్ని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మాధవీ శ్రీలత, యూఎన్‌డీపీ అధికారుల బృందం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు