నిషేధం.. సమర్పయామి!

26 May, 2017 23:33 IST|Sakshi
ఉల్చాల రోడ్డులో రిజిస్ట్రేషన్‌ చేసిన వక్ఫ్‌ భూమి
ప్రభుత్వ భూములకు రెక్కలు!
- లొసుగుల ఆధారంగా రిజిస్ట్రేషన్లు
- ప్రొహిబిటెడ్‌ లిస్టు గొడలకే పరిమితం
- రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్ల కీలకపాత్ర
- అధికారులతో ప్లాట్ల బ్రోకర్ల మిలాఖత్‌
- సెంటుకో రేటుతో వ్యాపారం
- ఆక్రమణలపై అధికారుల ఉదాసీన వైఖరి
 
  • కర్నూలు మండలం రుద్రవరంలో సర్వే నెం.675లోని ప్రభుత్వ భూమిని సెక‌్షన్‌ 71(కోర్టు అనుమతి) కింద రిజిస్ట్రేషన్‌ చేశారు.
  • కర్నూలు మండలం బి.తాండ్రపాడులోని సర్వే నెం.336, 337(మంగళగిరి కాలనీ)లలో 59 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఈ భూమి నగర పరిసరాల్లో ఉండటంతో రిజిస్ట్రేషన్‌ చేశారు.
  • కల్లూరు పరిధిలోని రేడియో స్టేషన్‌ సమీపంలో 320/1ఏ వక్ఫ్‌ బోర్డు భూమి ఉంది. పరిమళనగర్‌ పేరిట ప్లాట్లు వేసి విక్రయించారు. ఇక్కడ కోర్టు కాపీని సాకుగా చూపి పని కానిచ్చేశారు.
  • ఉల్చాల రోడ్డులోని సర్వే నెం.124లో వక్ఫ్‌ భూమి ఉంది. దీన్ని గంపగుత్తగా రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇక్కడ సెంటుకు రూ.3వేలు చొప్పున తీసుకున్నట్లు తెలిసింది.
  • కర్నూలు మండలం దిన్నెదేవరపాడు పరిధిలోని జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల వెనుక సర్వే నెం.19లో 60 ఎకరాల వక్ఫ్‌ భూమి ఉంది. రూ.20వేల నుంచి రూ.40వేల వరకు మామూళ్లు తీసుకొని రిజిస్ట్రేషన్‌ చేసినట్లు సమాచారం.
  • కర్నూలు శివారు బళ్లారి చౌరస్తా నుంచి కొత్త ఈద్గాకు వెళ్లే రహదారి(సంతోష్‌నగర్‌)లోని సర్వే నెం.382లో వక్ఫ్‌ స్థలం ఉంది. ఈ స్థలానికీ రిజిస్ట్రేషన్‌ జరిగిపోయింది.
  •  ప్రభుత్వ భూములను ఎలాంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అవకాశం లేకపోయినా.. లొసుగులను అవకాశంగా చేసుకొని పని కానిచ్చేస్తున్నారు.
 
కర్నూలు(టౌన్‌): ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు అక్రమార్కులు అక్కడ వాలిపోతున్నారు. అధికారుల చేతులు తడిపి రిజిస్ట్రేషన్‌ తంతు పూర్తి కానిచ్చేస్తున్నారు. ఇంకాస్త సమస్యత్మకం అయితే.. మామూళ్ల రేటు కాస్త పెంచితే పని ఇట్టే అయిపోతోంది. జిల్లా వ్యాప్తంగా ఈ తంతు సాగుతున్నా.. కర్నూలు శివారు, గ్రామాల పరిధిలోని భూముల విషయంలో వ్యవహారం మితిమీరింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను జిల్లాకే చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పర్యవేక్షిస్తున్నారు.
 
అయితే ఈ ప్రాంతంలోనే ప్రభుత్వ భూమి యథేచ్ఛగా అన్యాక్రాంతమవుతోంది. ప్రతి రిజిస్ట్రేషన్‌కు రూ.2వేలు వసూలు చేస్తుండగా.. అసైన్డు భూముల రిజిస్ట్రేషన్‌కు రూ.20వేల నుంచి రూ.40వేల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. అసైన్డు.. ప్రొహిబిటెడ్‌ లిస్టులోని సర్వే నెంబర్లు.. దేవాదాయ, వక్ఫ్‌, క్రైస్తవ ఆస్తులను ఎలాంటి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్‌ చేయరాదు. వాస్తవానికి ఈ భూములకు మార్కెట్‌ విలువ కూడా ఉండదు. అయితే రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు ఆ భూములకు సమీపంలోని ప్రయివేట్‌ భూముల సర్వే నెంబర్ల మార్కెట్‌ విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. రికార్డుల్లో మాత్రం ఈ భూములను నిషేధిత సర్వే నెంబర్లుగానే చూపుతుండటం గమనార్హం. ప్రొహిబిటెడ్‌ సర్వే నెంబర్ల విషయంలో కర్నూలు, కల్లూరు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు కంప్యూటర్‌ సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్లాట్ల బ్రోకర్లు ముందుగానే అధికారులతో మాట్లాడుకుని బేరం కుదుర్చుకున్న తర్వాత చకచకా పని జరిగిపోతోంది. అడిగే నాథుడే లేకపోవడంతో ఈ దందా అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది.
 
సెంటు రిజిస్ట్రేషన్‌కు రూ.20వేల నుంచి రూ.40వేలు
దేవాదాయ, వక్ఫ్‌ బోర్డు, క్రైస్తవ ఆస్తులతో పాటు వివాదాస్పద స్థలాల విషయంలో రిజిస్ట్రేషన్‌ అధికారులు సెంటుకు రూ.వేలల్లో వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. సంతోష్‌నగర్‌ సమీపంలో వక్ఫ్‌ బోర్డు స్థలం రిజిస్ట్రేషన్‌ విషయంలో సెంటుకు రూ.30 వేలు వసూలు చేసినట్లు సమాచారం. రుద్రవరం మండలంలో రూ.10వేల నుంచి రూ.15వేలు.. పుల్లారెడ్డి కళశాల వెనుక(సమీపంలో) రూ.20వేల ప్రకారం వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. ఈ భూములు ఒకప్పుడు పట్టణానికి దూరంగా ఉండటం.. ప్రస్తుతం నగర పరిధి విస్తరిస్తున్న నేపథ్యంలో అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరలేచింది. అదేవిధంగా 2014 సంవత్సరంలో స్టాంటన్‌పురం, మామిదాలపాడు, మునగాలపాడు గ్రామ పంచాయతీలను కర్నూలు నగరపాలక సంస్థలో విలీనం చేశారు. దీంతో పట్టణానికి సమీపంలోని దేవాదాయ, వక్ఫ్‌ భూములపై అక్రమార్కుల కన్నుపడింది.
 
ఆక్రమణలపై చూసీచూడనట్లుగా..!
జిల్లాలో ప్రభుత్వ భూములతో పాటు వక్ఫ్‌, క్రిస్టియన్‌ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా అధికారుల చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు వస్తే తప్ప కన్నెత్తి చూసే పరిస్థితి కనిపించట్లేదు. దేవాదాయ, వక్ఫ్‌ బోర్డు, క్రైస్తవ ఆస్తులను ఆయా వర్గాల సంక్షేమం దృష్ట్యా కేటాయించినా.. ఆ దిశగా ఎలాంటి ఫలితం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పర్యవేక్షణ కొరవడటం.. అధికారుల అవినీతి.. అక్రమార్కుల చాకచక్యం.. వెరసి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి పెద్దల చేతుల్లోకి వెళ్లిపోతోంది.
 
ఫిర్యాదులు వాస్తవమే.. విచారణ చేయిస్తా
దేవాదాయ, వక్ఫ్‌ బోర్డు, క్రైస్తవ ఆస్తులు, భూముల విషయంలో ఫిర్యాదులు వస్తున్నాయి. నిషేధిత సర్వే నెంబర్లలో ప్లాట్లు, భూములతో పాటు అసైన్డ్‌ భూములను రిజిస్ట్రేషన్‌ చేయరాదు. ప్రొహిబిటెడ్‌ సర్వే నెంబర్ల లిస్టు కార్యాలయంలో ప్రదర్శించాం. కొనుగోలుదారులు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని విచారణ చేయిస్తాం. నిబంధనలకు విరద్ధుంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లయితే చర్యలు తీసుకుంటాం.
– యు.వి.వి.రత్న ప్రసాద్‌, జిల్లా రిజిస్ట్రార్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 
 
మరిన్ని వార్తలు