పచ్చని గ్రామాల మధ్య ప్రాజెక్ట్‌ చిచ్చు

5 Oct, 2016 22:41 IST|Sakshi
పచ్చని గ్రామాల మధ్య ప్రాజెక్ట్‌ చిచ్చు
– తుందుర్రు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్, బాధితులపై కేసులు ఎత్తివేయాలి
– ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణం విషయంలో పునరాలోచన చేయాలి
– ప్రజల అంగీకారంతోనే పరిశ్రమలు స్థాపించాలి
– తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు
– వైఎస్సార్‌ సీపీ నాయకుల బృందం హెచ్చరిక
– వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు బాధిత గ్రామాల్లో పర్యటన
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని కాలరాస్తూ ఒంటెత్తు పోకడలతో పచ్చని గ్రామాల మధ్య చిచ్చుపెడుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమబాట పట్టిన గ్రామాలపై పోలీసుల దమనకాండ, అణచివేత చర్యలు కొనసాగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, మాజీమంత్రులు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ సీఈసీ సభ్యుడు వంకా రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు తదితరులతో కూడిన బందం బాధిత గ్రామాల్లో బుధవారం పర్యటించింది. తుందుర్రు, జొన్నలగరువు, కె.బేతపూడి గ్రామాల్లో ప్రజలను కలిసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. అనంతరం మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ నరసాపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆక్వా ఫుడ్‌పార్క్‌ నిర్మాణం కోసం పచ్చని గ్రామాల మధ్య ప్రభుత్వం చిచ్చుపెట్టి, అలజడి వాతావరణం సష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని నిర్మాణం విషయంలో 4 మండలాలకు చెందిన సుమారు 30 గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. పంట భూములు కాలుష్యం బారినపడి నష్టపోతామని రైతులు, జీవనాధారం పోతుందని మత్స్యకారులు, కాలుష్యం వల్ల భవిష్యత్‌ తరాలకు ఇబ్బందులు వస్తాయని ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. ఆక్వాపార్క్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రెండేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఆక్వా పార్క్‌ నిర్మాణం విషయంలో గ్రామసభలు పెట్టడం, ప్రజల సందేహాలు, భయాలను నివత్తి చేయడం వంటి ప్రయత్నాలను ప్రభుత్వం చేయలేదన్నారు. మొండిగా ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అడుగడుగునా పోలీస్‌ క్యాంప్‌లు పెట్టారని అన్నారు. బాధిత గ్రామాల నుంచి ఎవరైనా బయటకు వెళ్లాలన్నా.. గ్రామాల్లోకి రావాలన్నా ఆధార్‌ కార్డులు చూపించాల్సిన పరిస్థితి కల్పించారంటే, చంద్రబాబు పాలన ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమవుతోందని అన్నారు. గ్రామాల్లో తక్షణమే 144 సెక్షన్‌ ఎత్తివేయాలని, ఆందోళనకారులపై పెట్టిన సెక్షన్‌ 307 సహా అన్ని కేసులు ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు.
 
పొల్యూషన్‌ బోర్డు కార్యదర్శి రావాలి : మాజీ మంత్రి కొలుసు
వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు కార్యదర్శి స్వయంగా తుందుర్రు పరిసర గ్రామాల్లో పర్యటించాలని డిమాండ్‌ చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇక్కడి పరిస్థితులు అనుకూలమా.. కాదా, కాలుష్య ప్రభావం ఎంతవరకూ ఉంటుందనే విషయాలు పరిశీలన చేయాలని కోరారు. ఫ్యాక్టరీ పనులు ప్రారంభించక ముందే గ్రామసభలు నిర్వహించి పరిశ్రమ వల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, దీనివల్ల కాలుష్య సంబంధ ఇబ్బందులేమిటనే విషయాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఇక్కడ ఇవేమీ చేయలేదంటే తప్పు జరుగుతున్నట్టే అర్థమవుతోంది కదా అని ప్రశ్నించారు. ‘మీకు అనుకూలంగా ఉన్న పారిశ్రామిక వేత్తల కోసం కుటిల రాజకీయాలు చేస్తారా’ అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఇదేమిటని అడిగితే వైఎస్సార్‌ సీపీ అభివద్ధిని నిరోధిస్తోందంటూ అభాండాలు వేయడం ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నారన్నారు. ఆక్వా ఫుడ్‌పార్క్‌ విషయంలో ప్రజల్లో ఉన్న ఆందోళనలు, భయాలు తొలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఉందన్నారు. ప్రజల అంగీకారంతో పరిశ్రమలు స్థాపిస్తే వైఎస్సార్‌ సీపీ సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. ఆక్వా పార్క్‌ నిర్మించడానికి తుందుర్రు అనుకూలం కాకపోతే వేరేచోటకు తరలించాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 
 
మరిన్ని వార్తలు