ప్రాజెక్టులను నిర్మించి తీరుతాం

24 Jul, 2016 21:17 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీస్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి
  • అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు
  • ‘సింగూరు’ నీరు జిల్లాకే వినియోగం
  • ‘ఘనపురం’ను పట్టించుకోని నాటి పాలకులు
  • డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి  
  • మెదక్‌: తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు అడ్డుకుంటే వారికి ప్రజలే బుద్ధిచెబుతారని డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. కరువు, కాటకాల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రాజెక్ట్‌ల నిర్మించి కాల్వల ద్వారా సాగు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.

    కాంగ్రెస్, టీడీపీ నాయకులు వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఆదివారం ఆమె మెదక్‌ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వందేళ్ల చరిత్ర గల ఘనపురం ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ నాయకులు తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదన్నారు.

    ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక ఇప్పటి వరకు ఎంఎన్‌, ఎఫ్‌ఎన్‌ కెనాల్‌ సిమెంట్‌లైన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించామన్నారు. సింగూరు నీటిని జిల్లాలో సాగునీటికే వాడాలని , హైదరాబాద్‌ ప్రజల తాగునీటి కోసం గోదావరి, కృష్ణ జలాలను రప్పించడం జరుగుతుందని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిపారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపుతో అదనంగా ఆయకట్టు సాగవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఆ పనులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి సునీతారెడ్డి ఇరిగేషన్‌ మంత్రిగా ఉండి కూడా ఘనపురం ప్రాజెక్ట్‌ను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆమె వెంట జెడ్పిటీసీ లావణ్యరెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు