ప్రాజెక్టులకు జలకళ

2 Aug, 2016 23:22 IST|Sakshi
ప్రాజెక్టులకు జలకళ
– జీడీపీ జూలైలో నిండడం ఇదే తొలిసారి 
– నేడో, రేపో గేట్లెత్తి హంద్రీ నదికిS విడుదల
–  జిల్లావ్యాప్తంగా 90 శాతం చెరువులకు నీరు
– శ్రీశైలంలో నీటి చేరికకు రెట్టింపు మొత్తంలో అవుట్‌ ఫ్లో
– నీటిమట్టం 840 అడుగులకు చేరితే హంద్రీనీవాకు విడుదల
 
 
కర్నూలు సిటీ:
జిల్లాతోపాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండడంతో సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుతోపాటు దానిపై ఆధారపడిన వెలుగోడు, ఆవుకు అలగనూరు రిజర్వాయర్లు మినహా జిల్లా వ్యాప్తంగా ఇరిగేషన్, పంచాయతీరాజ్‌ చెరువులు జలంతో తొణికిసలాడుతున్నాయి. హంద్రీనదిపై 1979లో నిర్మించిన గాజులదిన్నె (సంజీవయ్య సాగర్‌) ప్రాజెక్టు జూలై చివరి నాటికి పూర్థిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడం ఇదే మొదటిసారిగా ఇరిగేషన్‌ ఇంజినీర్లు చెబుతున్నారు. తుంగభద్రపై కర్నూలు మండలం సుంకేసుల వద్ద నిర్మించిన కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి బ్యారేజీ ఇప్పటీకే పూర్థిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో కేసీ కాల్వకు 2 వేల క్యుసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. 
37 ఏళ్లలో మొదటి సారి...!
జిల్లా పశ్చిమ ప్రాంతంలోని గ్రామాలకు తాగు,సాగునీటి కోసం గోనెగండ్ల మండలం గాజులదిన్నె వద్ద హంద్రీనదిపై గాజులదిన్నె ప్రాజెక్టుకు 1971లో పునాదులు వేసి 1979 నాటికి పూర్తి చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 377 మీటర్లు, నీటి సామర్థ్యం 4.5 టీఎంసీలు. గోనెగండ్ల, కోడుమూరు, క్రిష్ణగిరి, దేవనకొండ మండలాలకు చెందిన 21 గ్రామాల పరిధిలోని 24,372 ఎకరాలకు జీడీపీ నీరే ఆధారం. నిర్మించింది మొదలు ఈ రోజు వరకు తీసుకుంటే జూలై నెలలో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దీంతో నేడో, రేపో ప్రాజెక్టు గేట్లు పైకెత్తి హంద్రీనదికి విడుదల చేసేందుకు అధికారులు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ నుంచి అనుమతి తీసుకున్నారు. నదీతీర గ్రామాల వారిని అప్రమత్తం చేసేందుకు పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. 
చెరువుల ఆయకట్టుకు జలజీవాలు.. 
మైనర్‌ ఇరిగేషన్, పంచాయతీ రాజ్‌ శాఖల కింద 634 చెరువులుండగా వాటి పరిధిలో 80,226 ఎకరాల స్థీరికరించిన ఆయకట్టుంది. ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల బనగానపల్లె, డోన్‌ నియోజకవర్గాలు మినహా 90 శాతం చెరువులు పూర్థిస్థాయి నీటి మట్టానికి చేరాయి. ఫలితంగా ఆయా చెరువుల కింద ఆయకట్టు భూముల్లో వరిసాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.
శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లోను మించి అవుట్‌ ఫ్లో.. 
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయం శ్రీశైలంకు ఇన్‌ఫ్లో, అంతకు మించి ఆవుట్‌ ఫ్లో కొనసాగుతోంది. కష్ణా నది ఎగువ నుంచి 16 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా కుడి, ఎడమ పవర్‌ హౌస్‌ల్లో విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం దిగువన ఉన్న సాగర్‌కు 32 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.  ప్రస్తుతం శ్రీశైలంలో 824.60 అడుగుల నీటిమట్టం వద్ద 44.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటి మట్టం 840 అడుగులకు చేరితే హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వకు పంపింగ్‌ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 
 
మరిన్ని వార్తలు