తాడోపేడో.. ఆస్తుల స్వాధీనానికి ప్రణాళిక

11 Aug, 2016 00:22 IST|Sakshi
ఇప్పటికే కల్యాణమండపం, బంక్‌ స్వాధీనం
కార్మికసంఘాల తొలి విజయం
తగరపువలస :  చిట్టివలస జూట్‌మిల్లు యాజమాన్యం కార్మికులకు ముఖం చాటేసి ఏడుసంవత్సరాల నాలుగు మాసాలు అవుతుంది. కార్మికులకు యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిలు  170 కోట్లు ఉన్నాయి. వీటిలో ట్రస్టీల వద్ద ఉన్నపీఎఫ్‌ నిల్వలు రూ.13.30 కోట్లు, యాజమాన్యం నేరుగా చెల్లించాల్సిన గ్రాట్యూటీ రూ.50కోట్లు, అక్రమ లాకౌట్‌కు సంబంధించి వేతనాలు చెల్లింపు చట్టం ప్రకారం 2015 మార్చి వరకు రూ.106 కోట్లు  బకాయి ఉంది. ఈ మొత్తం మిల్లు యజమాని తన ఆస్తులను అమ్మితే తప్ప కార్మికులకు చెల్లించలేని పరిస్థితి.  ఆదిశగా ప్రయత్నించక పోవడంతోకార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ  మిల్లు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన కార్మిక ఉద్యమానికి బలం చేకూర్చింది.
కల్యాణమండపం, పెట్రోల్‌ బంక్‌ స్వాధీనం..
 మిల్లు యాజమాన్య ప్రతినిధుల చేతుల్లో ఉన్న కల్యాణమండపం, లేబర్‌ వెల్ఫేర్‌ సెంటర్, పెట్రోల్‌బంక్‌లను మూడురోజుల కిందట స్వాధీనం చేసుకున్నారు. మరో వారం రోజుల్లో యాజమాన్యం నుంచి అనుకూల ప్రకటన రాకపోతే బంతాటమైదానం, ఇతర ఆటస్థలాలను స్వాధీనం చేసుంటామని కమిటీ  ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు కార్మికుల ఆకలికేకలు, సంఘాల ఆక్రందనలు ఖాతరు చేయని మిల్లు యాజమాన్యం ప్రతినిధులు పెట్రోల్‌బంక్‌ స్వాధీనం చేసుకోవడంతో కదులుతున్నారు. ఈ పట్టు వదిలితే ఇక యాజమాన్యం ఎంతమాత్రం రాడని అందువలన మిల్లు స్థిరాస్తులను స్వాధీనం చేసుకునే పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. కార్మికవాడలోని కార్మికులను చెదరగొట్టేందుకు ఇళ్లు ఖాళీచేయాలని జారీచేసిన నోటీసులకు కార్మికులు బెదరలేదు.
 
 
మరిన్ని వార్తలు