‘గ్రేటర్’ గాలం!

1 Dec, 2015 01:40 IST|Sakshi
‘గ్రేటర్’ గాలం!

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధిలోని నివాస గృహాల యజమానులకు త్వరలో తీపి కబురు అందనుంది. భారీ మొత్తంలో ఆస్తి పన్ను రాయితీ నజరానా ప్రకటించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.1,200, ఆలోపు వార్షిక ఆస్తి పన్ను చెల్లిస్తున్న పేద, మధ్య తరగతి నివాస గృహాల యజమానుల నుంచి ఇకపై రూ.101 మాత్రమే వసూలు చేయాలని గతంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన త్వరలో కార్యరూపం దాల్చనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 15 తర్వాత ఏ క్షణంలోనైనా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ లోగానే ఆస్తి పన్ను రాయితీని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

 నివాస గృహాలపై రూ.1,200లోపు ఆస్తి పన్నుకు బదులు రూ.101 మాత్రమే విధించడంతో పాటు పనులకు అనుమతుల జారీ విషయంలో ఆర్థికపర అధికార పరిమితులు పెంచాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ కమిషనర్, ప్రత్యేకాధికారి బి.జనార్దన్‌రెడ్డి తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనల అమలుకు జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ కోసం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ చర్యలు ప్రారంభించింది. ప్రతిపాదనలను రాష్ట్ర ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించిన వెంటనే జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండేళ్ల వరకు స్థానిక అవసరాలకు తగ్గట్లు ఇరు రాష్ట్రాలూ పాత చట్టాలకు సవరణలు జరుపుకోవచ్చని రాష్ట్ర పునర్విభజన చట్టంలో కల్పించిన వెసులుబాటు ఆధారంగా జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ సులువుగా పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. మరో వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలు అమలైతే జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.1,200 లోపు ఆస్తి పన్ను గల 5,09,187 గృహాల యజమానులకు లబ్ధి చేకూరనుంది. వీరు ప్రస్తుత సంవత్సరంలో రూ.29.40 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉండగా, పాత బకాయిలు రూ.57.99 కోట్లు ఉన్నాయి. మొత్తం కలిపి రూ.87.39 కోట్ల పన్నులు మాఫీ కానున్నాయి.

 ఈ మొత్తాన్ని ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి చెల్లించాలని ప్రతిపాదనల్లో కోరారు. ప్రస్తుతం రూ.600 లోపు ఆస్తి పన్ను ఉంటే పూర్తిగా మాఫీ చేస్తుండగా, ఈ పరిమితిని రూ.1,200కు పెంచి నామమాత్రంగా రూ.101 మాత్రమే వసూలు చేస్తారు.

 జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిమితుల భారీగా పెంపు!
 జీహెచ్‌ఎంసీ పరిధిలో పనులకు అనుమతుల జారీ విషయంలో కమిషనర్, స్టాండింగ్ కమిటీ, జనరల్ బాడీల ఆర్థికపర అధికార పరిమితులను సైతం భారీగా పెంచేం దుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ రూ.2 కోట్ల వరకు, స్టాండింగ్ కమిటీ రూ.3 కోట్ల వరకు, జనరల్ బాడీ రూ.6 కోట్ల వరకు పనులకు అనుమతులు జారీ చేసేం దుకు వెసులుబాటు కల్పిస్తూ జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ చేయనుంది.

మరిన్ని వార్తలు