వైద్య బిల్లుల చెల్లింపు చకచకా!

24 Dec, 2015 00:46 IST|Sakshi
వైద్య బిల్లుల చెల్లింపు చకచకా!

♦ ఈఎస్‌ఐ కార్డు కలిగిన కార్మికులకు వెంటనే రీయింబర్స్‌మెంట్
♦ నెలల తరబడి ఎదురుచూపులకు చెక్
♦ రీయింబర్స్‌మెంట్‌కు ప్రత్యేక బడ్జెట్
♦ కార్మికశాఖకు ప్రతిపాదనలు
 
 సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌ఐ కార్డుదారులకు శుభవార్త! కార్మికులు అత్యవసర సమయంలో ఏదైనా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందితే వాటి బిల్లుల చెల్లింపు విషయంలో నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. దీంతో కార్మికులు వైద్యం కోసం చేసిన అప్పులు గుదిబండగా మారేవి. ఇకపై వీటికి చెక్ పెట్టాలని ఈఎస్‌ఐ డెరైక్టర్ దేవికా రాణి కొత్త ప్రతిపాదన చేశారు. వైద్య బిల్లుల రీయింబర్స్‌మెంట్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి దానికి ఒక అధిపతి (హెడ్‌ఆఫ్ ది డిపార్ట్‌మెంట్)ని నియమించాలని నిర్ణయించారు. తద్వారా కార్మికుల వైద్య బిల్లులకు త్వరతగతిన చెల్లింపులు జరగనున్నాయి. ఈమేరకు ఈఎస్‌ఐ డెరైక్టరేట్ కార్యాలయం నుంచి కార్మికశాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. అక్కడ గ్రీన్‌సిగ్నల్ లభిస్తే వెనువెంటనే కార్యరూపం దాల్చనుంది. దీనిద్వారా 10 లక్షల మంది కార్మికులకు లబ్ధిచేకూరనుంది.

 పెండింగ్‌లో 7 వేల దరఖాస్తులు
 ఈఎస్‌ఐ కార్డుదారులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటే ఆ బిల్లులకు తొలుత సంబంధిత డిస్పెన్సరీలో ఆమోదం పొందాలి. ఆ తర్వాత ఈఎస్‌ఐ డెరైక్టరేట్ కార్యాలయానికి పంపాలి. అక్కడ మెడికల్ రీయింబర్స్‌మెంట్ విభాగం పరిశీలిస్తుంది. అనంతరం వైద్యుల కమిటీ ఆమోదం పొందిన తర్వాత కూడా అకౌంట్స్ విభాగం నుంచి డబ్బులు విడుదల కావడానికి నెలల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి. ప్రస్తుతం రీయింబర్స్‌మెంట్ విభాగం వద్ద 7 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తోడు ప్రతీ నెల దాదాపు వెయ్యి వరకు దరఖాస్తులు వస్తున్నా... ఏడు వందలకు మించి పరిష్కారం కావడంలేదు. దీంతో కార్మికుల వైద్యబిల్లులు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి. గత ఫిబ్రవరి నుంచి వచ్చిన బిల్లుల వెరిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొత్త ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే కేవలం నెల రోజుల్లో రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.

మరిన్ని వార్తలు