అడవి పందుల నుంచి.. పంటలను కాపాడుకోండి

21 Dec, 2016 22:57 IST|Sakshi
అడవి పందుల నుంచి.. పంటలను కాపాడుకోండి
  •  రెడ్డిపల్లి కేవీకే కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.లక్ష్మిరెడ్డి
  • అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లా వ్యాప్తంగా కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతం కలిగిన పరిసర గ్రామాల్లో పంటలకు జింకలు, అడవి పందుల బెడద ఎక్కువగా ఉందని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.లక్ష్మిరెడ్డి అన్నారు. వాటి నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో... కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పంటలను కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. 

    నివారణ మార్గాలు ఇలా

    • మనుషుల తల వెంట్రుకలు పొలంలో, పందులు వచ్చే మార్గంలో వేయడం ద్వారా పంటలను కాపాడుకోవచ్చు. మట్టిని వాసన చూస్తూ పొలంలోకి ప్రవేశించేటప్పుడు వాటి ముక్కులోకి వెంట్రుకలు ప్రవేశించి పందులను తీవ్రంగా బాధిస్తాయి. ఓ దఫా వాటి ముక్కుల్లో నుంచి వెంట్రుకలు బయటకు రాకుండా వాటిని ఇబ్బందులకు గురిచేయడంతో మళ్ళీ మళ్ళీ ఆ పంట వైపు పందులు చూడవు.
    • రాత్రివేళల్లో గంటకు ఒకసారి పొలాల్లో టపాకులు కాల్చినట్లైతే అడవి పందులు దూరంగా పారిపోతాయి. ఒక కొబ్బరి తాడును తీసుకుని వాటి పురుల మధ్య అక్కడక్కడ పటాకులు పెట్టి ఒక చెట్టుకు వేలాడదీయాలి. ఇలాంటివి పొలంలో నాలుగైదు చోట్ల పెట్టి రాత్రి వేళల్లో కొబ్బరి తాడుకు నిప్పంటించాలి. కాలుకుంటూ పోయే కొద్ది మధ్యలో ఉన్న పటాకులు పేలుతాయి.
    • పొలం మధ్యలో ఒక చోట ఒక పెద్ద కిరోసిన్‌ దీపం వెలిగించి రాత్రంతా ఆరిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పొలాల్లో మినుక్కు మినిక్కుమంటూ వెలిగే లైట్లు అమర్చినా కొంత ఫలితం ఉంటుంది.
    • పొలంలో అక్కడక్కడ పది అడుగుల ఎత్తు ఉన్న కట్టెలు వాటికి బెలూన్‌లు వేలాడదీయాలి. రాత్రివేళ్లలో అవి గాలికి ఎగురుతూ ఉంటాయి. వాటిని చూసి అడవి పందులు పంట దగ్గరికి కూడా రావు. కట్టెలకు  తెల్లగుడ్డలను కట్టి  వేలాడదీసినా పారిపోతాయి.
    • సోలార్‌ ఫెన్సింగ్‌ ఖర్చుతో కూడుకున్నదైనా అడవి పందుల బెడద నుంచి పంటలకు శాశ్వత పరిష్కారం అవుతుంది. ఫెన్సింగ్‌ను పశువులు, మనుషులు తాకినా ప్రాణనష్టం ఉండదు.
    • పొలం చుట్టూ రెండు అడుగుల ఎత్తులో 10 అడుగుల దూరానికి ఒక కొయ్య పాతాలి. వాటìకి పంది చమురు లేదా చెడిపోయిన బ్యాటరీ వ్యర్థాలతో కూడిన పదార్థాన్ని పూయాలి. ఈ  వాసనకు పందులు రావు. అలాగే కుళ్లిపోయిన కోడిగుడ్లు వేయడం ద్వారా ఆ దుర్వాసనకు పరిసర ప్రాంతాల్లోకి కూడా పందులు రావు.
    • గుడ్డ సంచుల్లో 100 గ్రాములు చొప్పున ఫోరేట్‌ గుళికలు మూటగట్టి పొలంలో అక్కడ ఉంచాలి. వీటిని పొలంలో అక్కడక్కడ కొయ్యలకు వేలాడదీసి అప్పుడప్పుడు తడుపుతుండాలి. దీంతో ఫోరేట్‌ వాసన పొలమంతా వ్యాపిస్తుంది. ఈ వాసనకు అడవి పందులు రావు.
    • పొలం చుట్టూ కందకాలు తవ్వుకోవడం ద్వారా అడవి జంతువుల బెడదను తగ్గించుకోవచ్చు. కందకాల వల్ల భూగర్భ జలాల అభివృద్ధికి ఓ వైపు దోహదపడుతూనే అడవి జంతువుల బెడదను కూడా నిర్మూలిస్తుంది.
    • పొలం చుట్టూ గట్ల వెంబడి రెండు మూడు సాళ్లు చొప్పున తెల్ల కుసుము సాగు చేయడం ద్వారా వాటికుండే ముళ్లుల కారణంగా పందులు పొలాల్లోకి వచ్చే అవకాశం ఉండదు.
మరిన్ని వార్తలు