పాఠశాలల మూసివేతను నిరసిస్తూ ధర్నా

19 Apr, 2017 00:37 IST|Sakshi
పాఠశాలల మూసివేతను నిరసిస్తూ ధర్నా
ఏలూరు సిటీ : విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో రేషనలైజేషన్‌ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ పాఠశాలల మూసివేతను నిరసిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్పొరేట్‌ విద్యావ్యవస్థను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్సార్‌ సీపీ ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి కె.దినేష్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా పిల్లల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో స్కూళ్లను మూసివేత నిర్ణయం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. మూడు అంచెల పాఠశాల విధానానికి చరమగీతం పాడుతూ రెండు అంచెలకు తీసుకురావటం అనేది విద్యహక్కు చట్టాన్ని ఉల్లంఘించటమేనని తెలిపారు. పాఠశాలలను రేషనలైజేషన్‌ పేరిట కుదిస్తే వేలాదిమంది పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్పొరేట్‌ విద్యాసంస్థలు లాభపడతాయని తెలిపారు. పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. తక్షణమే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు ఎం.దిలీప్, రాకేష్, ఏలూరు సిటీ నాయకులు పి.ప్రదీప్‌చంద్ర, ఎన్‌.నాగార్జున, ప్రకాష్, రాజేష్, ఎల్‌.సందీప్, ఎల్‌.ఆర్య, గణేష్‌ ఉన్నారు.
 
 
మరిన్ని వార్తలు