యాదాద్రి ఘాట్‌రోడ్డుపై ధర్నా

24 Sep, 2016 00:53 IST|Sakshi
యాదగిరికొండ
దురుసుగా ప్రవర్తించడంతో పాటు దేవస్థానం వర్తక సంఘం అధ్యక్షుడిపై చేయి చేసుకున్న హోంగార్డుపై చర్య తీసుకోవాలని కోరుతూ వర్తకసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గంటసేపు దేవస్థానం ఎదుట బైఠాయించారు. అమెరికా పర్యటన ముగించుకుని దేవస్థానం ఈఓ గీతారెడ్డి శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు.  ఈ సందర్భంగా ఆమెను స్నేహపూర్వకంగా కలవడానికి  వర్తకసంఘం అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య కొండపైకి వెళ్తుండగా విధుల్లో ఉన్న  హోంగార్డు అర్వపల్లి అడ్డుకున్నాడని తెలిపారు.  హోంగార్డు దురుసుగా ప్రవర్తించి చేయి కూడా చేసుకున్నాడని ఆరోపించారు. విషయాన్ని తెలుసుకున్న దుకాణదారులు సంఘటన స్థలానికి చేరుకుని అర్వపల్లిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని కోరుతూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎస్సై రాజశేఖర్‌రెడ్డి, దేవస్థానం ఈఓ గీతారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కర్రె వెంకటయ్యపై చేయి చేసుకున్న హోంగార్డుపై విచారణ జరుపుతామని, విచారణ పూర్తయ్యే వరకు అతన్ని విధుల్లోకి తీసుకోమని,  తప్పు అని తేలితే చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అనంతరం హోంగార్డుపై వర్తకసంఘం ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  కార్యక్రమంలో వర్తకసంఘం సభ్యులు కొన్న రమేష్, శివకుమార్, మిట్ట వెంకటయ్య, కర్రె వీరయ్య, బాలరాజు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు