నిలదీతలు.. నిరసనలు

14 Jul, 2017 02:15 IST|Sakshi
నిలదీతలు.. నిరసనలు

మంత్రి లోకేష్‌కు చుక్కెదురు
నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారంటూ యువకుల మండిపాటు
కాన్వాయ్‌ను అడ్డుకొని ఆందోళన
కిరోసిన్, చక్కెర ఇవ్వడం లేదన్న మహిళలు
పర్యటన ఆలస్యం కావడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం  


సాక్షినెట్‌వర్క్‌: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లోకేష్‌ పర్యటన ఆద్యంతం గురువారం.. నిలదీతలు..నిరసనల మధ్య కొనసాగింది. నంద్యాల మండలం కానాల గ్రామంలో జరిగిన సభలో..మీకు నెల నెలా సక్రమంగా రేషన్‌ అందుతుందా అని అడగ్గానే వృద్ధులు, మహిళలు చక్కెర, కిరోసిన్‌ రావడం లేదని చెప్పారు. ఉపాధి పనులు సక్రమంగా జరుగుతున్నాయా అని అడగగా..అరకొర అనే సమాధానం వచ్చింది. కానాల నాగమ్మ చెరువు ఆక్రమణకు గురైందని, ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు మంజూరు చేయలేదని, తాగునీటి సమస్య 45గ్రామాల్లో తీవ్రంగా ఉందని..సమస్యలు ఏకరువు పెట్టారు.  

నిలదీత..
నంద్యాల ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద మంత్రి లోకేష్‌ కాన్వాయ్‌ని ఏపీఎస్‌ఎఫ్‌  నాయకులు అడ్డుకున్నారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. మోసపూరిత హామీలతో ఓట్లు దండుకొని విద్యావంతులైన యువకులకుతీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

నిరాశతో వెనుదిరిగిన లంబాడీలు
షెడ్యూల్‌ ప్రకారం ఓర్వకల్లు మండలం గుడుంబాయ్‌ తండాలో లోకేష్‌ పర్యటించాల్సి ఉంది. అయితే దానిని రద్దు చేసుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌పై  తండా వాసులతో మంత్రి  ముఖాముఖి కార్యక్రమం ఉండేది. అయితే నంద్యాలలోనే సాయంత్రం ఏడు గంటలైనా పర్యటన ముగియకపోవడంతో గుడుంబాయి తండా పర్యటను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కోసం మూడు గంటల నుంచి ఎదురు చూస్తున్న తండా వాసులకు నిరాశతో వెనుదిరిగారు.

నిరుత్సాహం.. పాణ్యంలోని నూతనంగా నిర్మించిన వర్మీకంపోస్టును ప్రారంభించేందుకు  మధ్యాహ్నం 2గంటలకు మంత్రి రావాల్సి ఉంది. అయితే  రాత్రి 7గంటలకు చేరుకోవడంతో కార్యకర్తలు డీలా పడ్డారు. పూలు చల్లవద్దని చెప్పడంతో మహిళలు వాటిని కింద పడేశారు. మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికే తోపులాటతో ఇద్దరు మహిళలు కింద పడ్డారు. మంత్రి రాత్రి సమయంలో రావడంతో కార్యకర్తలు కొందరు బహిరంగంగానే విమర్శలకు దిగారు.

>
మరిన్ని వార్తలు