జిల్లా క్రీడలకే గర్వకారణం

27 Sep, 2016 23:24 IST|Sakshi
పతకాలు సాధించిన మాస్టర్‌ స్విమ్మర్లను అభినందిస్తున్న డీఎస్‌డీవో శ్రీనివాస్, పక్కనే సంఘ ప్రతినిధులు
 స్విమ్మింగ్‌లో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించిన సిక్కోలు స్విమ్మర్లు
 
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ స్థాయి మాస్టర్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో శ్రీకాకుళం స్విమ్మర్లు అద్భుతమైన ఫలితాలు సాధించి జిల్లాకే గర్వకారణంగా నిలిచారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్‌ అన్నారు. తెలంగాణా రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లో ఈ నెల 23, 24 తేదీల్లో మాస్టర్‌ అక్వాటెక్‌ స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 3వ జాతీయస్థాయి అక్వాటెక్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో శ్రీకాకుళం మాస్టర్‌ స్విమ్మర్లు సరికొత్త రికార్డుకు శ్రీకారం చుట్టారు. ఏపీ స్విమ్మింగ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జిల్లా స్విమ్మర్లు మొత్తం 26 పతకాలతో అదరగొట్టారు. ఇందులో 17 బంగారు పతకాలతో పాటు 4 రజత, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. వీరంతా సోమవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం మాస్టర్స్‌ స్విమ్మింగ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌జీవో హోంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
 
డీఎస్‌డీఓ శ్రీనివాస్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై పతకాలు సాధించిన మాస్టర్‌ స్విమ్మర్లను అభినందించారు. క్రీడాకారులకు పూలమాలలువేసి సత్కరించారు. ఆంధ్రరాష్ట్రంలో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించడంలో సిక్కోలు స్విమ్మర్లదే కీలకపాత్ర అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్‌ స్విమ్మింగ్‌ సంఘ అధ్యక్షులు బుక్కూరు ఉమామహేశ్వరరావు, సంఘ కార్యదర్శి నౌపడ రాజారావు, సహధ్యక్షులు దుప్పల వెంకటరావు, ఉపాధ్యక్షులు సీహెచ్‌ వెంకట్, ఐ.గోవిందరావు, లక్ష్మణరావు, కోశాధికారి డి.అజిత్‌కుమార్, గీతాశ్రీకాంత్, సీనియర్‌ స్విమ్మర్లు పాల్గొన్నారు. 
 
 
 
 
మరిన్ని వార్తలు