స్థానికులకు ఉపాధి కల్పించండి: జూపల్లి

22 Nov, 2015 03:18 IST|Sakshi
స్థానికులకు ఉపాధి కల్పించండి: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులు, మహిళలకు ఉపాధి కల్పించాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్)లో భాగంగా నాలుగో విడతలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుకానున్న 16 పరిశ్రమల ప్రతినిధులకు అనుమతి పత్రాలు అందజేశారు. సచివాలయంలోని సీ బ్లాక్‌లో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఉప కార్యదర్శి సైదాతో పాటు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. నాలుగో విడతలో  మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో రూ. 1,570.64 కోట్ల పెట్టుబడులతో 1,812 మందికి ఉపాధి దక్కుతుందని మంత్రి వెల్లడించారు.

టీఎస్ ఐపాస్‌లో భాగంగా నాలుగో విడతలో బుధవారం అనుమతులు పొందిన 16 సంస్థల్లో సౌర విద్యుత్, ఏరోస్పేస్ ప్రొడక్ట్స్, రబ్బర్ టైర్స్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయన్నారు. మహిళల్లోనూ ఐటీఐ అర్హత కలిగిన వారు ఉన్నందున అవకాశం ఇవ్వాలని మంత్రి సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు నైపుణ్య అభివృద్ధి కోసం కొత్తగా ఏర్పాటయ్యే స్కిల్ డెవలప్‌మెంట్ అకాడమీ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. నాలుగు విడతలు... రూ.5,205.43 కోట్లు..
 
 ఈ ఏడాది జూన్‌లో ఆవిష్కరించిన నూతన పారిశ్రామిక విధానం నిబంధనల మేరకు ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 68 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా రూ. 5,205.43 కోట్ల పెట్టుబడులు, 13,438 మందికి ఉపాధి దక్కుతుందని పరిశ్రమల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నూతనంగా అనుమతులు పొందిన పరిశ్రమల్లో 95 శాతం మేర హైదరాబాద్ పరిసరాల్లోని రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోనే ఏర్పాటు కానున్నాయి. 
మరిన్ని వార్తలు