మధ్యాహ్న భోజన కార్మికుల పని భద్రత కల్పించాలి

17 Jul, 2016 16:53 IST|Sakshi
మధ్యాహ్న భోజన కార్మికుల పని భద్రత కల్పించాలి

మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌

మొయినాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న కార్మికులకు పని భద్రత కల్పించాలని ఆ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మండల పరిధిలోని చిలుకూరు మల్లన్న దేవాలయం వద్ద ఆదివారం మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన నిర్వహణను ప్రభుత్వం ’మన్నా’ ట్రస్టుకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. 14 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు. ట్రస్టుకు మధ్యాహ్న భోజన నిర్వహణను అప్పగిస్తే జిల్లాలో 4,500 మంది కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రస్టు ద్వారా భోజన నిర్వహణ సక్రమంగా ఉండదని పేర్కొన్నారు. ఒక చోట వంటచేసి అక్కడి నుంచే అన్ని పాఠశాలలకు సరఫరా చేస్తారని తెలిపారు. సరఫరా చేస్తే అన్నం పాడవుతుందని.. రవాణా సౌకర్యం సరిగా లేని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం అందదని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి మధ్యాహ్న భోజన కార్మికులకు పని భద్రత కల్పించాలని కోరారు. సమావేశంలో కార్మికులు రాధాలక్ష్మి, మంజుల, లక్ష్మి, పెంటమ్మ, లక్ష్మమ్మ, విజయలక్ష్మి, జ్యోతి, సుశీల, అండాలు, అమల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు