సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సైకో ఎందుకయ్యాడు?

23 Dec, 2015 02:16 IST|Sakshi
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సైకో ఎందుకయ్యాడు?

* సివిల్స్‌లో ర్యాంకు రాలేదనే ఆవేదనతో సైకోలా మారిన బల్వీందర్‌సింగ్
* తల్లిదండ్రులు, అడ్డువచ్చిన వారిపై తల్వార్‌తో దాడి
* ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి
* ఉన్మాది దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలు.. అతడి తల్లి పరిస్థితి విషమం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: ఐసెట్‌లో ఆరో ర్యాంకు.. ఏడాదికి 18.5 లక్షల వేతనం.. కానీ సివిల్స్‌లో ర్యాంకు రాలేదనే ఆవేదనతో ఉన్మాదిగా మారాడు. సైకోలా మారి తల్వార్‌తో వీరంగం సృష్టించాడు.

కన్న తల్లిదండ్రులను నరికేయబోయాడు. తప్పించుకోబోతే వెంటాడుతూ దాడి చేశాడు. ఆపబోయిన వారినీ వదల్లేదు, అడ్డువచ్చిన పోలీసులనూ వదల్లేదు. పోలీసుల వద్ద ఉన్న పిస్టల్‌నూ తీసుకుని కాల్చబోయాడు. చివరికి పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఆ ఉన్మాది పేరు బల్వీందర్‌సింగ్. కరీంనగర్‌లోని లక్ష్మీనగర్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇతని దాడిలో తల్లిదండ్రులు, పోలీసులు సహా ఆరుగురికి గాయాలయ్యాయి.

అతని తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్‌లోని లక్ష్మీనగర్‌కు చెందిన సర్దార్ బల్వీందర్‌సింగ్ (28) బెంగళూర్‌లోని ఒరాకిల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బల్వీందర్ చదువులో  ప్రతిభావంతుడు. ఐసెట్‌లో ఆరో ర్యాంకు సాధించాడు. వరంగల్ నిట్‌లో చదువుకున్నాడు. ఒరాకిల్ సంస్థ క్యాంపస్ సెలక్షన్‌లో ఎంపికయ్యాడు. ఏటా రూ. 18.5 లక్షల వేతనం లభిస్తోంది. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా ఎంచుకున్న బల్వీందర్ సింగ్ కొన్నాళ్ల కింద సివిల్స్ పరీక్షలు రాశాడు.

కానీ మంచి ర్యాంక్ రాకపోవడంతో మనస్తాపానికి గురై.. ఈనెల 17న బెంగళూర్ నుంచి కరీంనగర్‌లోని తమ ఇంటికి వచ్చేశాడు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో అకస్మాత్తుగా ఇంట్లోని తల్వార్ తీసుకుని తల్లిదండ్రులపై దాడి చేశాడు. వారు భయంతో బయటకు పరుగెత్తినా వెంబడించాడు. రోడ్డుపై అడ్డువచ్చిన ఆటోడ్రైవర్ శ్రీమన్నారాయణతో పాటు మరో పది మందిపైనా దాడి చేసి గాయపరిచాడు.

ఈ సమాచారం అందడంతో కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని.. బల్వీందర్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ వారిపైనా బల్వీందర్ తల్వార్‌తో దాడికి దిగడంతో మీర్ ఆలీ అనే కానిస్టేబుల్‌కు రెండు చేతివేళ్లు తెగిపోయాయి. ఇదే సమయంలో హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య ఆధ్వర్యంలోని మరో పోలీసు బృందం అక్కడికి చేరుకుని బల్వీందర్‌ను పట్టుకునే ప్రయత్నం చేసింది. సైకోలా చెలరేగిపోయిన బల్వీందర్ .. హెడ్ కానిస్టేబుల్‌పైనా తల్వార్‌తో దాడికి దిగాడు.

ఈ సమయంలో హెడ్‌కానిస్టేబుల్ వద్ద ఉన్న పిస్టల్ కింద పడిపోయింది. ఆ పిస్టల్‌ను అందుకున్న బల్వీందర్.. హెడ్ కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న కరీంనగర్ వన్‌టౌన్ సీఐ విజయసారథి వైపు పిస్టల్ గురి పెట్టాడు. దీంతో సీఐ ఆత్మరక్షణ కోసం తన వద్ద ఉన్న పిస్టల్‌తో బల్వీందర్‌పై కాల్పులు జరిపారు. పొట్టపై కుడివైపు పక్కటెముకల వద్ద బుల్లెట్ తగలడంతో బల్వీందర్ గట్టిగా కేకలు వేస్తూ కిందపడిపోయాడు.

వెంటనే అతడిని పట్టుకున్న పోలీసులు తొలుత ప్రభుత్వ ఆస్పత్రికి అనంతరం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బల్వీందర్ మృతి చెందాడు. బల్వీందర్ మృతదేహానికి నలుగురు ప్రభుత్వ వైద్యుల బృందం, కరీంనగర్ డివిజన్ మెజిస్ట్రేట్, ఆర్డీవో చంద్రశేఖర్ సమక్షంలో వీడియో రికార్డింగ్‌తో పోస్టుమార్టం చేశారు.
 
తల్లి పరిస్థితి విషమం
బల్వీందర్ దాడిలో అతని తల్లిదండ్రులు సర్దార్ అవతార్‌సింగ్(50), సత్వీందర్ కౌర్(45)లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో సత్వీందర్ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్ మృతుడి తల్లిదండ్రులు, గాయపడిన వారిని పరామర్శించారు. మరోవైపు బల్వీందర్ బంధువులతోపాటు అతడి సామాజిక వర్గానికి చెందినవారు పోస్టుమార్టం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి ఆందోళన చేశారు.

బల్వీందర్ మానసిక పరిస్థితి బాగోలేదని వారు పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై నిబంధనల ప్రకారం కాళ్లపై కాల్పులు జరపాల్సి ఉన్నా.. పోలీసులు కడుపులో కాల్చడమేమిటని ప్రశ్నించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు