క్లిక్‌ కొట్టు... ఫిర్యాదు పెట్టు

29 Sep, 2016 00:49 IST|Sakshi
క్లిక్‌ కొట్టు... ఫిర్యాదు పెట్టు
  • ప్రధాని దృష్టికి స్థానిక సమస్యలు
  • అందుబాటులో కొత్త పోర్టల్‌
  • ఇంటర్నెట్‌ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం
  • అన్ని వర్గాలకు చేరువలో మోదీ ప్రభుత్వం
  •  
    కాజీపేట : పరిపాలనలో పారదర్శకతను పాటించి అవినీతికి తావు లేకుండా ప్రజలకు సేవలందించాలనే సంకల్పంతో భారత ప్రధాని నరేంద్రమోదీ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. డిజిటల్‌ ఇండియాలో భాగంగా నూతన సంస్కరణల అమలుకు కృషి చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో ఎక్కడ నివసిస్తున్న వారైనా నేరుగా తమ సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే అవకాశాన్ని కొన్ని రోజుల క్రితం కల్పించారు. సామాన్యుడు, ఉన్నత వర్గాలనే భేదం లేకుండా పీఎం దృష్టికి సమస్య తీవ్రతను తీసుకెళ్లే సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులను వేగవంతం చేయడంతో పాటు అవినీతిని నిర్మూలించేలా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ప్రధానికి సమస్యలను వివరించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. 
     
    ఇదీ పోర్టల్‌..
     
    ఇంటర్నెట్‌లో ముందుగా పీఎం.ఇండియా.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావ్వాలి. తర్వాత వచ్చే పేజీలో ఇంటర్‌-ఆక్ట్‌ విత్‌ పీఎం దగ్గర క్లిక్‌ చేయాలి. అనంతరం వ్రైట్‌ టు ది ప్రైమినిష్టర్‌ వద్ద క్లిక్‌ చేస్తే పూర్తి వివరాలు తెరపై కనిపిస్తాయి. 
     
    ఫిర్యాదు చేయడం ఇలా..
     
    ఈ-పోర్టల్‌ ద్వారా ప్రధానమంత్రికి నేరుగా ఫిర్యాదు చేయాలంటే ముందుగా ఫిర్యాదుదారుడి పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఇందులో పేరు, స్త్రీ, పురుషులా, సంస్థ పేరు, దేశం, రాష్ట్రం, జిల్లా, పిన్‌కోడ్‌ వివరాలు అందజేయాలి. అనంతరం సమస్యను సంక్షిప్తంగా అర్థమయ్యే రీతిలో నమోదు చేయాలి. సమస్య పరిష్కారం వివరాలు తెలుసుకోవాలంటే ఫిర్యాదుదారుడు తప్పనిసరిగా సెల్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీలను పొందుపర్చాలి. 
     
    19 అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు..
     
    అవినీతి, విద్య, ఉద్యోగ, ప్రభుత్వ పథకాల అమలు, వ్యవసాయం, పోలీసు, పట్టణాభివృద్ధి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సమస్యలతోపాటు న్యాయ, భూ, కార్మిక గృహనిర్మాణాలు, ఇతర సమస్యలపై ప్రధానికి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. 
     
    నాలుగు వేల అక్షరాల లోపే..
    ఫిర్యాదుదారుడు పూర్తి వివరాలు నమోదు చేసే పేజీలోనే దిగువ భాగానా ఫిర్యాదు కోసం ప్రత్యేక బాక్స్‌ కేటాయించారు. ఈ గడీలో కేవలం నాలుగువేల అక్షరాలలోపే సమస్యను వివరించాలి. సమస్యను వివరించే క్రమంలో పదాలు, కామాలు, ఫుల్‌స్టాప్‌లు మాత్రమే వినియోగించాలి. కంప్యూటర్‌ కీ బోర్డులో ఉన్న ఇతర అక్షరాలు వాడకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. 
     
    స్పందిస్తే ప్రయోజనం..
     
    ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి మన సమస్యలు విన్నవించాలంటే కంప్యూటర్, ఇంటర్నెట్‌పై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలి. తమ ప్రాంతాల్లో పట్టి పీడిస్తున్న సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తే శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం యువత ఇంటర్నెట్‌ ఎక్కువగా వాడుతున్నందున స్పందించి ఫిర్యాదులు చేస్తే  పలు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సామాజిక రుగ్మతలు, అవినీతి, అక్రమాలపై పీఎంకు ఫిర్యాదు చేసి దస్త్రవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
     
    ఎన్‌ఆర్‌ఐలకూ అవకాశం..
     
    స్థానిక ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఫిర్యాదు చేయొచ్చు. వీరు ఆయా ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను ఈ-పోర్టల్‌ ద్వారా పీఎంకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. ఏ దేశంలో ఉంటున్నామో..ఆ ప్రాంతం పేరు, సమస్యపై ఫిర్యాదు నమోదు చేసే అవకాశం ఉంది. 
     
మరిన్ని వార్తలు