ప్రజారోగ్యం పట్టదా?

20 Sep, 2016 00:31 IST|Sakshi
ప్రజారోగ్యం పట్టదా?
  • ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వానికి సిగ్గు రాలేదు
  • దారుణ పరిస్థితులున్నా మంత్రులు పట్టించుకోవడం లేదు
  • ఎమ్మెల్సీ గేయానంద్‌ ధ్వజం
  • సర్వజనాస్పత్రి ఎదుట నిరవధిక దీక్ష

  • అనంతపురం సిటీ :
    ‘ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా అనంతలో చిన్నపాటి జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గుగా అనిపించడం లేదు. సర్వజనాస్పత్రిలో 350 పడకల మీద 1,006 మంది రోగులను ఎలా పడుకో బెడతారో అర్థంకావడం లేదు. 50 పడకలున్న చిన్న పిల్లల వార్డులో 200 మంది చేరారు. వారిని ఇక్కడ చేర్చుకోకుండా వైద్యులు బయటకు పంపలేరు కదా! ప్రభుత్వం ప్రతిదానికీ వైద్యులపై పడే బదులు.. ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిస్తే ఏ సమస్యా ఉండద’ని ఎమ్మెల్సీ గేయానంద్‌ అన్నారు.

    అనంతపురం సర్వజనాస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ సోమవారం స్థానిక ఆస్పత్రి ఎదుట నిరవధిక దీక్ష చేపట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆస్పత్రికి వచ్చిన ఎమ్మెల్సీ.. చిన్న పిల్లల వార్డును తనిఖీ చేశారు. అనంతరం వైద్యులతో సమీక్షించారు. ఆస్పత్రిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు చికిత్స అందించేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను వైద్యులు ఏకరువు పెట్టడంతో ఆయన మధ్యాహ్నం 1.30 గంటలకు నేరుగా ఆస్పత్రి ముఖద్వారం వద్దకు చేరుకుని బైఠాయించారు. రాత్రి వర్షంలోనే దీక్ష కొనసాగించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జిల్లా మొత్తానికి ఏకైక దిక్కయిన సర్వజనాస్పత్రిని ఇంతటి దారుణస్థితిలో ఉంచుతుందా అని ప్రశ్నించారు. పాతికేళ్లకు పైగా సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అయిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అనేకమార్లు వచ్చివెళుతున్నా సర్వజనాస్పత్రి సమస్యలు మాత్రం తీర్చడం లేదన్నారు. అనంతపురం బోధనాస్పత్రిలో పడకల పెంపు, 510 ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన 124 జీవోను తక్షణం అమలు చేయాలని  ఇప్పటికే చాలాసార్లు మంత్రులను కలిసి విన్నవించామన్నారు. అయితే ఎవరూ స్పందించడం లేదన్నారు. విష జ్వరాలతో చిన్న పిల్లలు చనిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కామినేని శ్రీనివాస్‌ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే దాకా నిరవధిక దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. దీక్షకు వైఎస్సార్‌సీపీ నేత చవ్వా రాజశేఖరరెడ్డి, ప్రజాసంఘాల నాయకులు, రచయితలు, మేధావులు  సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అంజి, నాగరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

    నేడు జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల
    అనంతపురం సెంట్రల్‌ : ఈ నెల 25లోగా గొల్లపల్లి రిజర్వాయర్‌ వరకూ నీటిని తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జిల్లా పర్యటనలో హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో మంత్రి సునీత కూడా నీటి విడుదలపై ప్రకటన చేశారు.lసీఎం మాట నెగ్గించుకునేందుకు హడావుడిగా జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి హంద్రీనీవా ఫేజ్‌–2 కాలువకు మంగళవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నామని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ సీఈ జలంధర్‌ తెలిపారు. ప్రస్తుతం 90 కిలోమీటరు వరకు నీటిని తీసుకుపోతామన్నారు. నెల, రెండు నెలల తర్వాత పనులు పూరై్తతే గొల్లపల్లి రిజర్వాయర్‌ వరకూ నీటిని తీసుకుపోతామన్నారు. ఓ వైపు హెచ్చెల్సీ సాగులో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. మరో వైపు రెండేళ్లుగా పంటల సాగుకు నోచుకోక ఆయకట్టు బీడుగగా మారింది. రూ. కోట్లు ఖర్చు చేసి శ్రీశైలం జలాశయం నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా నీటిని తీసుకొస్తున్నారు. ఒక్కో టీఎంసీ తీసుకురావడానికి రూ. 12 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇంత విలువైన జలాలను కాలువల్లో పారించడం కోసమేనా ? అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతుంది. కనీసం తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ఆర్బాటం కోసం మాత్రమే అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    నేటి నుంచి చెరువులకు నీరు విడుదల
    అనంతపురం సెంట్రల్‌ :  మిడ్‌పెన్నార్‌ సౌత్‌ కెనాల్‌ కింద ఉన్న చెరువులకు మంగళవారం నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు హెచ్చెల్సీ ఎస్‌ఈ శేషగిరిరావు తెలిపారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ కెనాల్‌ కింద దాదాపు 23 చెరువులు ఉన్నాయన్నారు. హంద్రీనీవా నుంచి వచ్చే నీటిని బట్టి హెచ్చెల్సీ సౌత్, నార్త్‌ ఇతర కాలువ కింద ఆయకట్టుకు నీరు వదలాల వద్దా అనే అంశాన్ని నిర్ణయిస్తామని వివరించారు.

     

     

మరిన్ని వార్తలు