ప్రాణాలు పోతున్నా స్పందించని ప్రభుత్వమిది

3 Oct, 2016 22:04 IST|Sakshi
ప్రాణాలు పోతున్నా స్పందించని ప్రభుత్వమిది
  • అన్ని రకాల జ్వరాలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి
  • వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి
  • సమస్యలపై పోరాడితే పీడీ యాక్టులా?
  • కురసాల కన్నబాబు
  •  
    పసలపూడి (రాయవరం) :
    ‘జిల్లాలో అన్ని రకాల జ్వరాలూ ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఏజెన్సీలో కాళ్ల వాపులతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. అయినా చంద్రబాబుది జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించని అసమర్ధ ప్రభుత్వం’ అంటూ వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. సోమవారం రాయవరం మండలం పసలపూడి వచ్చిన  ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడ చూసినా అనారోగ్యకర వాతావరణం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దోమలపై దండయాత్ర చేస్తూ తనకు తాను కమెండోగా ప్రకటించుకున్నారన్నారు. ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ నిజమైన కమెండోగా ప్రజల గుండెల్లో నిలుస్తున్నారన్నారు. 
     
    మీరు చేస్తే పోరాటం.. మేము చేస్తే పీడీ యాక్టులా?
    ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారిపై పీడీ యాక్టులు పెట్టాలంటూ చంద్రబాబు చేసిన ప్రకటన పట్ల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా జిల్లాలో సెజ్‌ భూములు, తమ్మవరంలో ప్రజా సమస్యల తరపున పోరాటం చేసిన విషయాన్ని కన్నబాబు గుర్తు చేశారు. అప్పుడు ప్రతిపక్షనేతగా చంద్రబాబు చేస్తే తప్పులేదు కాని..ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసు వేధింపులు ఎక్కువయ్యాయని కన్నబాబు ఆరోపించారు. అధికారులు పచ్చచొక్కాలు వేసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వారి తరపున పోరాటం చేస్తానన్నారు. 
     
    8–10 వేల ఇళ్లకు వెళుతున్నారు
    గడపగడపకూ వైఎస్సార్‌లో భాగంగా జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాల్లో పార్టీ నేతలు రోజూ జిల్లాలోని ఎనిమిది నుంచి 10 వేళ్ల ఇళ్లకు వెళుతున్నారన్నారు.  కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితులున్నాయన్నారు. కోరుమిల్లి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోలేదని పింఛన్లు ఆపిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై తాను డీఆర్‌డీఏ పీడీ దృష్టికి తీసుకుని వెళ్తానన్నారు. వెంటనే వారికి పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ మండపేట నియోజకవర్గ కన్వీనర్‌ వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజబాబు), పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు