ఇంటికో గంట ప్రహసనంలా పల్స్ సర్వే

13 Jul, 2016 03:35 IST|Sakshi
ఇంటికో గంట ప్రహసనంలా పల్స్ సర్వే

కేటాయించిన వారైతేనే.. లేకపోతే ఓపెన్ కాని ట్యాబ్
ముందుగానే వీధులు.. ఎన్యుమరేటర్ల పేర్లు ఫీడింగ్
ఈ నెల 31లోపు పూర్తి చేయడం అసాధ్యం

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ సర్వే ప్రహసనంలా మారింది... ఇది ప్రజలు, సిబ్బందిలో పల్స్ రేటు పెరిగేలా చేస్తోంది... ఒక్కో ఇంటికి గంట సమయం పడుతుండటంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు... ఇందులో కుల గణన ప్రస్తావన ఉండటంతో అధిక శాతం మంది ప్రజలు అయిష్టత ప్రదర్శిస్తున్నారు.

 సాక్షి, కడప : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించాలని నిర్ణయించి పల్స్ సర్వేకి శ్రీకారం చుట్టింది. అయితే ప్రస్తుత సర్వే పరిస్థితి చూస్తే ఆశించిన స్థాయిలో అనుకున్న లక్ష్యాలను సాధించేలా కనిపించడం లేదు. ప్రత్యేకంగా ఈ నెల 31లోపు పల్స్ సర్వేను  పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. వాస్తవ పరిస్థితి చూస్తే సర్వే పూర్తి చేయడానికి నెలాఖరు కాదు.. రెండు, మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులే పేర్కొంటున్నారు. ఈ నెల 8 నుంచి పల్స్ సర్వే ప్రారంభించినా ఊపందుకోలేదనే చెప్పాలి. ఎన్నో సమస్యలు, ఒక్కో సారి ట్యాబుల ఇబ్బందులు, మరోసారి ఎన్యుమరేటర్లు ఏదో ఒక పరిస్థితుల నేపథ్యంలో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లు సర్వే సాగుతోంది.

ఒక ఇంటికి ఒక గంట
ప్రభుత్వం తరఫున ఎన్యుమరేటర్లు చేపడుతున్న పల్స్ సర్వే చాలా సమయం తీసుకుంటోంది. ఒక ఇంటికి సంబంధించి సర్వే చేయాలంటే దాదాపు గంట సమయం పడుతోంది. సుమారు 91 కాలమ్స్‌ను సంబంధిత వ్యక్తులను అడిగి ఎన్యుమరేటర్లు పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో ఆస్తులు, ఇల్లు, భూములు, ఇంటిలోని వస్తువులు, బయట పని చేస్తున్న ఉద్యోగం, కార్యాలయం, కులం, చదువు ఇలా చెబుతూ పోతే ఎన్నో రకాల ప్రశ్నలతో సమాధానాలు పూరించాలి. అంతే కాకుండా మొదట వీధిలోని ఇంటి వద్దకు వెళ్లగానే యజమాని ఆధార్ కార్డు నంబరు ఫీడ్ చేయడం, తర్వాత వేలిగుర్తు వేయగానే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. తర్వాత జీపీఎఫ్ ద్వారా ఇంటిని బంధించడం, తర్వాత ప్రశ్నల పరంపర మొదలవుతుంది. ఇలా ఒక్కోసారి చేపట్టే పనిలో ఇతర అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఒక ఇంటికి సంబంధించిన సర్వే పూర్తి చేయాలంటే గంట సమయం పడుతోంది.

 ఎన్యుమరేటర్ కేటాయించిన ప్రకారం వెళితేనే..
జిల్లాలో పల్స్ సర్వేకి సంబంధించి ఎన్యుమరేటర్లు కేటాయించిన వీధుల ప్రకారం వెళితేనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పటికే ట్యాబుల్లో ఎన్యుమరేట్లకు సంబంధించిన గుర్తులు ఫీడ్ చేయడంతో కచ్చితంగా సంబంధిత ఎన్యుమరేటరే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఫలానా వీధి, ఫలానా ట్యాబ్, ఫలానా ఎన్యుమరేటర్ మూడింటికి సంబంధించి లింక్ పెట్టడంతో వేరే వారు సర్వే చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. కేటాయించిన ఎన్యుమరేటరే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

 కులగణనపై పెదవి విరుపు
పల్స్ సర్వేలో భాగంగా ఎన్యుమరేటర్లు కుల గణన రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం బీసీ, ఎస్సీ, ఓసీ ఇలా గణన నమోదు చేసేవారు. అయితే ప్రస్తుతం కులాలకు సంబంధించిన ప్రాతిపదికన బీసీల్లో ఉన్న ఉప కులాలు, ఎస్సీల్లో ఉన్న ఇతర కులాలు.. ఇలా అన్ని ఉప కులాలను చేరుస్తుండడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. అయితే రానున్న కాలంలో కులాల ప్రాతిపదిక పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం సమాచారాన్ని తీసుకుని అందుకు అనుగుణంగా పావులు కదపడానికి ప్రణాళిక రూపొందిస్తోందని చర్చించుకుంటున్నారు.

 31లోపు అసాధ్యం
ఈ నెల 8న ప్రారంభమైన పల్స్ సర్వే ఈ నెల 31లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఎన్యుమరేటర్లు, ఇతర సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు.

ఎందుకంటే సర్వేలో 91 కాలమ్స్ ఉన్న నేపథ్యంలో ఒక ఇంటిని సర్వే చేయాలంటేనే గంట సమయం పడుతున్న క్రమంలో అంత ఈజీ కాదని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులే పేర్కొంటున్నారు. ఒక్కొక్క ఇంటికి అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో 31లోగా సర్వే పూర్తి చేయడం దాదాపు అసాధ్యం!

ఐదు సార్లు మారిన సాఫ్ట్‌వేర్
రాష్ట్ర ప్రభుత్వం పల్స్ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టినా అనేక రకాల సమస్యలతో రోజూ సాఫ్ట్‌వేర్ మారుస్తున్నారు. ఈ నెల 8న ప్రారంభమైనా 13వ తేదికి అంటే ఐదు రోజుల నేపథ్యంలోనే సాఫ్ట్‌వేర్‌ను ఐదు సార్లు మార్చారు. దీంతో కొత్త ప్రశ్నలతోపాటు ఇతర అనేక రకాల అంశాలను చేరుస్తుండడంతో రోజురోజుకు సర్వే విషయంలో గందరగోళం నెలకొంటోంది. ఇదేమిటని ప్రశ్నించే అధికారి లేకపోగా...ఉన్నతాధికారులు చెప్పిందేవేదంగా పలువురు ఎప్పటికప్పుడు మారుతున్న సాఫ్ట్‌వేర్‌కుఅనుగుణంగా సర్వే నిర్వహిస్తున్నారు.           

మరిన్ని వార్తలు