‘పల్స్’ దొరకలేదా..?

9 Jul, 2016 01:18 IST|Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ర్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ సర్వేకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. శుక్రవారం జిల్లాలో సర్వే ప్రారంభమైనా ఆశించిన స్పందన కాన రాలేదు. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో కాళింగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు వివరాలు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని సమాచారం. మరికొన్ని గ్రామాల్లో ట్యాబ్‌లు మొరాయించాయి. దీంతో తొలిరోజు సమస్యలతోనే సరిపోయింది.  పల్స్ సర్వేలో కులాల జాబితా గందరగోళంగా ఉండడంతో కాళింగ వర్గం వారు ఈ సర్వేను మొదట నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికీ ఆ సామాజిక వర్గ నేతలు స ర్వేను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కూడా.

దీంతో తొలిరోజు వారు వివరాలిచ్చేందుకు అంగీకరించలేదు. కుల వివరాల్లో స్పష్టమైన విధానాన్ని ప్రకటించిన తర్వాతే వివరాలు చెబుతామని వారు తేల్చి చెప్పారు. శుక్రవారం లావేరు మండలంలో ఉన్న బుడుమూరులో ఈ సామాజిక వర్గానికి చెందిన వారు నమోదు నిలిపివేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు.  
 
ట్యాబ్‌లతో కష్టాలు...
ఇక సర్వేలో ట్యాబ్‌లు పెడుతున్న ఇబ్బందులు చెప్పనలవిగానివిగా ఉన్నాయి. జిల్లా కేంద్రం లో బాగానే పనిచేసిన ట్యాబ్‌లు గ్రామాల్లో మాత్రం పనిచేయడం లేదు. ఇప్పటి వరకు ట్యాబ్‌లకు రెండు వర్షన్లలో ప్రభుత్వం యాప్‌ను అందించింది. ఈ యాప్‌లో తొలుత 2.1 వెర్షన్ ఉంచగా అది పనిచేయలేదు. దీంతో ఈ నెల5న రాష్ట్ర ఉన్నతాధికారులు 2.2 వెర్షన్‌ను అందజేశారు. ఇది కూడా కొన్నిప్రాంతాల్లో పనిచేయడం లేదు. తొలిరోజున జిల్లాలో అన్ని మండలాల్లో, పురపాలక సంఘాల్లో 1342 మంది ఎన్యూమరేటర్లు వారి సహాయకులతో ట్యాబ్‌లతో క్షేత్ర స్థాయిలో సర్వేలు ప్రారంభించినా కేవలం 600లు మాత్రమే నమోదు జరిగాయి.శనివారం నుంచి కనీసం సగం గ్రామాల్లోనైనా 2.2 వెర్షన్ యాప్ ద్వారా సర్వే చేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు