‘పురుషోత్తపట్నం ఎత్తిపోతల’ బాధిత రైతులకు ఊరట

24 Mar, 2017 23:57 IST|Sakshi
–2013 భూసేకరణ చట్టం అమలు చేయాలి
-హైకోర్టు తీర్పుతో పెరగనున్న పరిహారం
-ఒనగూరనున్న అనేక ప్రయోజనాలు
సీతానగరం :  పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూసేకరణలో భూములు కోల్పోయే రైతులు శుక్రవారం నాటి హైకోర్టు తీర్పుతో ఊరట చెందారు. గతంలో భూసేకరణలో తమ భూములు ఇచ్చేందుకు సుమారు 230 మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టారు. మిగిలిన రైతులు తమ భూములు ఎకరానికి రూ.28 లక్షలకు ఇచ్చేది లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. భూములకు ధర చెల్లింపులో 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలంటూ  న్యాయవాది బి.రచనారెడ్డి రైతుల తరఫున పిటిషన్‌ వేశారు. 2013 భూసేకరణ చట్టం వర్తింపుతోనే ఎత్తిపోతల పథకానికి భూములు తీసుకోవాలని శుక్రవారం హైకోర్టు జడ్జి శేషసాయి తీర్పు చెప్పారని రైతులు తెలిపారు. ఈ తీర్పుతో ప్రభుత్వం నాలుగు రెట్ల ధరను పరిహారంగా అందించాలి. అలాగే ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయాలి. దీనితో పాటు ఈ భూములపై ఆధారపడిన కూలీలకు ఆరునెలల కూలి చెల్లించాలి. భూములు కోల్పోయే కుటుంబంలోని 18 ఏళ్ళు నిండిన యువకులకు ఉద్యోగం లేదా రూ.5 లక్షల పరిహారం చెల్లించాలి. అలాగే ఆర్థిక, సామాజిక సర్వే నిర్వహించి, గ్రామ సభలు జరపాలి. బహుళ పంటలు పండే భూములకు రెట్టింపు పరిహారం చెల్లించాలి. ఇలా పలు అంశాలు 2013 భూసేకరణ చట్టంలో పొందుపర్చి ఉన్నాయి. వీటిని అమలు పర్చాలంటే ఆరునెలలు పట్టే అవకాశం ఉంది. అయితే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన రైతుల భూముల్లో పనులు యథావిధిగా జరుగుతాయి.
మరిన్ని వార్తలు