పట్టిసీమ తరహాలోనే పురుషోత్తపట్నం

4 Jan, 2017 22:59 IST|Sakshi
పట్టిసీమ తరహాలోనే పురుషోత్తపట్నం
డిప్యూటీ సీఎం చినరాజప్ప
సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల పరిశీలన
పిఠాపురం టౌన్‌ : పట్టిసీమ తరహాలోనే పురషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని  డిప్యూటీ సీఎం, రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గురువారం నాటి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి బుధవారం పిఠాపురం వచ్చిన రాజప్ప విలేకరులతో మాట్లాడారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, జగ్గంపేట, పిఠాపురం ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ వెంట ఉన్నారు. చంద్రబాబు పిఠాపురంలో పాల్గొనే కార్యక్రమాల వివరాలు రాజప్ప వెల్లడించారు. రూ.1638 కోట్లతో చేపట్టే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పిఠాపురంలో ముఖ్యమంత్రి శుంకుస్థాపన చేస్తారన్నారు. ఈ పథకం పూర్తయితే ఏలేరు, పిఠాపురం బ్రాంచ్‌ కెనాల్‌ (పీబీసీ) ఆయకట్టు భూములు సస్యశ్యామలం అవుతాయని తెలిపార. ఏడాదిలోగా పూర్తయ్యే ఈ పథకం వల్ల అదనపు ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు.  
చంద్రబాబు పర్యటన సాగేదిలా..
ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం మధ్యాహ్నం పిఠాపురం చేరుకుంటారు. బైపాస్‌ రోడ్డులోని ఇల్లింద్రాడ జంక‌్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్ద ఆయన హెలికాప్టర్‌  దిగుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పాదగయ జంక‌్షన్‌ వద్దకు వచ్చి సామర్లకోట రోడ్డులోని వైభవ వెంచర్స్‌లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొంటారని,  అక్కడ ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారని చినరాజప్ప తెలిపారు. 
భారీ బందోబస్తు
పిఠాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం నుంచే పట్టణాన్ని పోలీసులు మొహరించారు.డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో బైపాస్‌ రోడ్డు, సామర్లకోట రోడ్డు, ఇల్లింద్రాడ జంక్షన్, వై జంక్షన్‌ ప్రాంతాల్లో పోలీసుల పహారా కాస్తున్నారు. సుమారు 1500 మంది పోలీసులను భద్రాతా విధులు నిర్వహిస్తారని డీఎస్పీ తెలిపారు.
మరిన్ని వార్తలు